‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోంది’: ఎమ్మెల్యే

by Kodari Anjali |

246 మంది లబ్ధిదారులకు రూ.2.46 కోట్ల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పంపిణీ చేశారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోంది’: ఎమ్మెల్యే
X

దిశ, దేవరకొండ టౌన్: పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన మొత్తం 246 మంది లబ్ధిదారులకు రూ.2,46,28,536 (రెండు కోట్ల నలభై ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు) విలువైన చెక్కులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, వివాహ ఖర్చుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఈ పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయని, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నాయని తెలిపారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి...

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి వర్గానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నామని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు సకాలంలో చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story