కలెక్టర్ గారూ.. జోక్యం చేసుకోండి.....

by Taduka Kalyani |

మూడేళ్లుగా జనరల్ సర్జరీ హెచ్‌వోడి పోస్టు ఖాళీగా ఉండటంతో వైద్య విద్య, వైద్య సేవలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని విద్యార్థులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను జిల్లా కలెక్టర్ వెంటనే పరిష్కరించేలా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

కలెక్టర్ గారూ.. జోక్యం చేసుకోండి.....
X

దిశ, నల్గొండ బ్యూరో:: నారాయణో హరి... అని డాక్టర్లను పిలుస్తుంటారు... అంటే కనిపించని దేవుడు వైద్యుడని అందరి భావన. అలాంటి దేవుళ్లను తయారు చేసే కళాశాలలో ప్రోఫసర్లు లేకుండానే కాలం వెళ్లదీస్తున్నారు. వైద్య విద్య కళాశాలలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ డిపార్టుమెంటుకు హెచ్ ఓ డి ( హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్... ) లేకుండా పోయారు. ఒక నెల.. రెండు నెలలు కాదు ఏకంగా మూడేళ్లకు పైగా కాలం నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. మధ్యలో పదోన్నతులు జరిగాయి... బదిలీలు జరిగాయి కానీ... ఆ పోస్టును మాత్రం బదిలీల సమయంలో ఖాళీగా చూపించలేదని సమాచారం.. దానికి కారణం మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులకు ఆత్మీయుడైన ఓ ప్రొఫెసర్ కోసం అధికారికంగా పోస్ట్ ను బ్లాక్ చేసినట్లు తెలిసింది.

అసలు విషయం ఏంటంటే....

మెడికల్ కాలేజీ సూపరిండెంట్, సూపరిండెంట్ గా ఓ జనరల్ సర్జన్ పనిచేశారు. అతను సుమారు 2023 సంవత్సరంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. నాటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే దర్శనం ఇస్తుంది.. అంటే దాదాపు మూడేళ్లుగా సంబంధిత డిపార్టుమెంటుకు హెచ్ ఓ డి లేరు. ఇదిలా ఉంటే 2025 సంవత్సరంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, ఫ్రొఫెసర్లు తదితరులకు పదోన్నతులు లభించాయి. 2026లో మొత్తం వైద్య విద్య శాఖలో బదిలీలు చేపట్టారు. కానీ ఈ ఖాళీ పోస్టు మాత్రం భర్తీ కాలేదు. అయితే గత మూడేళ్లుగా జనరల్ సర్జన్ లేకుండానే వైద్య విద్యార్థులకు అర్హత లేని ఫ్రొఫెసర్లతో విధ్యార్థులకు వైద్య విద్య భోదిస్తున్నారు. ఇంత కాలం సాధారణ విద్యకు టీచర్ లేకపోతేనే చాలా గందరగోళంగా ఉంటుంది. అలాంటి మనిషి ప్రాణాలకు జీవం పోసే వైద్య విద్యకు టీచర్ లేకపోతే ఆ విద్యార్థికి నష్టమే కాదు... ప్రజలకు కూడా తీవ్ర నష్టం.

మెడికల్ పీజీ సీట్లు బొక్క....

జనరల్ సర్జన్ ఫ్రొఫెసర్ ఉన్న ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ సీట్ల కోసం కాలేజీ నుంచి దరఖాస్తు చేసుకుంటే నాలుగు పీజీ విద్యార్థులకు సీట్ల ను నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) కేటాయిస్తుంది. కానీ నల్లగొండ మెడికల్ కాలేజీ లో సర్జన్ లేకపోవడం వల్ల ఆ పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసే దిక్కు లేకుండా పోయింది. తద్వరా గత రెండేళ్ల నుంచి 8 మంది విద్యార్థులకు నష్టం జరిగినట్లే. మెడికల్ కాలేజీ యాజమాన్యం కేవలం ఒక్క వ్యక్తి కోసం ఆ పోస్ట్ ను ఖాళీగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ పోస్టును దాచి పెట్టకుండా ఉంటే ఎవరైనా వచ్చేవారే కదా.. హైదరాబాద్ కి అతి సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీలో పనిచేయడానికి జిల్లా కేంద్రానికి రావడానికి ఎవరైనా ఇష్టపడతారు. నీట్ ప్రవేశాలు ప్రారంభమయ్యే రోజులు దగ్గరకు వస్తున్నాయని, ముఖ్యమైన విభాగాలలో నూతనంగా ప్రవేశం పొందే విద్యార్థులకు ఆ విభాగం అధిపతి లేకపోతే తీవ్రంగా నష్టం జరుగుతుంది. అయితే గతంలో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయాలని అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్లు కలిసి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కు, సూపరిండెంట్ కు వినతి పత్రాలు అందజేసిన ఫలితం లేకుండా పోయిందని మెడికల్ కాలేజీ సిబ్బంది వాపోతున్నారు. ఇదిలా ఉంటే కనీసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతున్న ట్లు తెలిసింది. ఇప్పటికైనా వైద్య విద్యార్థుల భవిష్యత్ కోసమైన జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని జనరల్ సర్జన్ పోస్టును భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు.

Next Story