- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ హనుమంతరావు
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఓటర్లకు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

దిశ, వలిగొండ: ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఓటర్లకు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా మహిళా సంఘం సభ్యులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు వినియోగంపై దిశానిర్దేశం చేయాలని సూచించారు. డబ్బు తీసుకొని ఓటు వేసినట్లయితే మీ గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని, నీతి నిజాయితీ గల నిస్వార్థ ప్రజా ప్రతినిధిని గుర్తించి ఓటు వేయాలని సూచించారు. ఒక్కరోజు ఆనందం కోసం ఐదు సంవత్సరాల కష్టాన్ని తీసుకురావద్దని, డబ్బు తీసుకొని, ఓటు వేసినట్లయితే గ్రామం అభివృద్ధి కాకుండా పోయి ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అన్నారు. అనంతరం ప్రధాన రహదారిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
అదేవిధంగా రెండవ విడత ఎన్నికలు జరుగుతున్న వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. వలిగొండ మండలంలో ఎంత మందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయని, ఇప్పటివరకు ఎంత మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకున్నారని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను గుర్తించి, వారికి బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని, తిరిగి సదరు ఓటరు తన ఓటు బ్యాలెట్ బాక్సులో వేసే వరకు సంబంధిత అధికారులు గమనించాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి అధికారి సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ సామగ్రిని పరిశీలించి ఏ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ గ్రామ పోలింగ్ సామగ్రి మొత్తం ఒకటికి రెండు సార్లు చెక్ చేసి, సిద్ధం చేసి పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, తహాశీల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎంఈఓ భాస్కర్, మహిళా సంఘ సభ్యులు, అధికారులు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.






