బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి... ఎక్కడ చూసినా సేమ్ సీనంటా!

by Dishanational1 |
బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి... ఎక్కడ చూసినా సేమ్ సీనంటా!
X

దిశ, నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తిరుగులేని శక్తిగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. దాదాపు 22 ఏండ్లుగా పార్టీ జెండాను భుజానికెత్తుకున్న నేతలు, ఉద్యమకారులెవ్వరికీ పార్టీలో ప్రాధాన్యం దక్కడంలేదనే అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్‌లో వర్గపోరు చాపకింద నీరులా పాకుతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ తీరు పట్ల విసుగుచెంది.. కీలక నేతలు పార్టీని వీడారు. కానీ కొంతమంది పార్టీ మమ్మల్ని గుర్తించకపోతుందా..? అనే అశతో ఏండ్ల తరబడి ఎదురుచూస్తోంది. అయినా ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతల నుంచి పెద్దగా సహకారం, ప్రాధాన్యం దక్కకపోవడం.. పార్టీ అధిష్టానం సైతం పట్టించుకోకపోవడం.. వారిని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపుతామని బలంగా నిర్ణయించుకుని అవకాశం కోసం వేచిచూస్తుండడం గమనార్హం.

ఏ నియోజకవర్గాల్లో అసంతృప్తి రాగం..

ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్‌లో విపరీతమైన అసంతృప్తి రాగం విన్పిస్తోంది. ఇటు ఆలేరు మొదలుకుని.. అటు హుజూర్‌నగర్ వరకు, అటు నాగార్జునసాగర్ నుంచి తుంగతుర్తి వరకు వర్గపోరు లేని నియోజకవర్గమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా కోదాడ, మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, ఆలేరు, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఇదిలావుంటే.. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు.. పార్టీ తీరుపట్ల విసుగుచెంది చకిలం అనిల్ కుమార్, పడాల శ్రీను తదితరులు పార్టీని వీడగా, మరికొంతమంది అదును కోసం వేచిచూస్తుండడం గమనార్హం.

ఎక్కడెక్కడ ఎవరంటే..?

సీఎం కేసీఆర్ 99 శాతం సిట్టింగ్‌లకే టికెట్ అన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో అసంతృప్తులు తమ కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా అంతంటా అసంతృప్తులకు కొదవలేదు. ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత కాగా, ఇదే నియోజకవర్గం నుంచి బూడిద భిక్షమయ్యగౌడ్, మోత్కుపల్లి నర్సింహులు, భువనగిరి నుంచి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా అదే సామాజికవర్గానికి చెందిన జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి వర్గీయులు, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాగా, కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి, కర్నే ప్రభాకర్, బొల్ల శివశంకర్, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు తదితరులు టికెట్ రేసులో నిలుస్తున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మద్య యుద్ద వాతావరణమే నెలకొన్నదని చెప్పాలి. కోదాడలో వేనేపల్లి చందర్ రావు, కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, హుజూర్‌నగర్‌లో పిల్లుట్ల రఘు, జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తుంగతుర్తిలో మందుల సామేలు, నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్లగొండలో పిల్లి రామరాజుయాదవ్, చాడ కిషన్ రెడ్డి, గుత్తా వర్గీయులు, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు అదును కోసం ఎదురుచూస్తున్నారు.

వచ్చే ఎన్నికలపై తీవ్ర ప్రభావం..

ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్‌లో పరిస్థితులు రోజురోజూకీ దిగజారిపోతున్నాయి. పార్టీ అధిష్టానం దృష్టి సారించకపోవడమో.. లేక ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి మారడమో తెలియదు గానీ ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. వచ్చే ఎన్నికల్లో తీవ్ర పరిణామాల్ని ఎదుర్కొవాల్సి వస్తుందని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అసంతృప్తి చల్లారలంటే.. ఎమ్మెల్యేలపై పార్టీ నియంత్రణ ఉండాలని, లేకుంటే ఎవరి దారి వారే అన్నట్టుగా మారుతుందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. అసలే ఓ వైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏ మాత్రం అవకాశం దొరికినా నేతలను తమవైపునకు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా పార్టీ అధిష్టానం మేల్కొంటుందా..? లేదా అన్నది వేచిచూడాల్సిందే.



Next Story

Most Viewed