మహిళా ఎస్సై‌గా చలామణి... పెళ్లి చూపుల్లో బయటపడ్డ నిజం

by Disha Web Desk 22 |
మహిళా ఎస్సై‌గా చలామణి... పెళ్లి చూపుల్లో బయటపడ్డ నిజం
X

దిశ, నకిరేకల్: నకిలీ మహిళా ఎస్సైగా గత ఏడాదిగా చలామణి అవుతున్న యువతని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన జడల మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్‌ఎస్సై పరీక్ష రాసింది. కంటి సమస్య ఉండడం వల్ల వైద్య పరీక్షల్లో క్వాలిఫై కాలేదు. కానీ ఆర్పీఎఫ్‌ ఎస్ఐగా శంకర్ పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు ఏడాదిగా అందరిని నమ్మించింది. అదే తరహాలో నకిలీ ఐడీ కార్డును యూనిఫామ్‌ను తయారు చేసుకుంది. డ్యూటీకి వెళ్తున్నట్లుగా యూనిఫాంలో వెళ్లి ప్రతి ఒక్కరిని నమ్మేలా చేసింది. అదేవిధంగా పెళ్లి సంబంధానికి వెళ్లిన సమయంలోను యూనిఫాంలో వెళ్లి సీఆర్‌పీ‌ఎఫ్‌ ఎస్ఐ అని చెప్పింది. ఈ క్రమంలో అబ్బాయి తరఫు వాళ్లు పై అధికారులను సంప్రదించగా ఆ యువతి చేసిన మోసం బయటపడింది. ఈ విషయం తెలిసిన పోలీసులు నకిలీ ఎస్సై గా చలామణి అవుతున్న మాళవికను అరెస్టు చేశారు. తల్లిదండ్రులు బాధపడతారని ఇలాంటి పనిచేసినట్లు మాళవిక తెలిపిందని రైల్వే పోలీసుల ద్వారా సమాచారం. ఇదిలా ఉంటే ఇంస్టాగ్రామ్‌లోను ఆర్పీఎఫ్ యూనిఫాంలో యువతి రీల్స్ చేసింది. ఇలా యూనిఫాంలో వీఐపీ దర్శనాలు చేసుకున్నట్లు సైతం విమర్శలు వస్తున్నాయి.


Next Story