పదుల సంఖ్యలో గేదెల అపహరణలు.. పోలీసులకు సవాల్..!

by Bhanu |

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో గేదెలు అపహరణకు గురవుతున్నాయి.. ప్రస్తుతం బయటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగొస్తాడో.. రాడో.. అనే సందేహాలు ఉన్నాయి

పదుల సంఖ్యలో గేదెల అపహరణలు.. పోలీసులకు సవాల్..!
X

దిశ, చిలుకూరు: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో గేదెలు అపహరణకు గురవుతున్నాయి.. ప్రస్తుతం బయటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగొస్తాడో.. రాడో.. అనే సందేహాలు ఉన్నాయి.. విచిత్రంగా చిలుకూరు మండలంలో మాత్రం మేతకు వెళ్లిన పశువు తిరిగి ఇంటికి వస్తుందో.. రాదో.. అని యజమానులు బిక్కు బిక్కు మంటున్నారు.. అపహరణకు గురైన పశువుల్లో పాడి గేదెలు కూడా ఉండడంతో వాటి రాక కోసం ఎదురు చూస్తూ అంబా అంటూ అరుస్తున్న లేగదూడల ఆర్తనాదాలు యజమానులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి..

గత కొన్ని రోజులుగా మండలంలోని పాలెఅన్నారం, చెన్నారిగూడెం తదితర గ్రామాలకు చెందిన పశువులు అపహరణకు గురవుతుండడంతో రైతులు, పశు పోషకులు ఆందోళనకు గురవుతున్నారు. వేసవిలో సాధారణంగా మేతకని ఉదయం పశువులను వదలుతుంటారు యజమానులు. వాటితో కూడా వారు వెళ్లరు. వరి కోతలు అయిపోయి పొలాలన్నీ ఖాళీగా ఉండడంతో పశువులు అవే మేత మేశాక సాయంత్రం వేళ తిరిగి వస్తుంటాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న అగంతుకులు కొందరు మేతకు వచ్చిన పశువులను అపహరిస్తున్నారు.

సీతారామపురం గుట్టలే అడ్డాగా..!?

చిలుకూరు, హుజూర్ నగర్ మధ్యలో ఉన్న సీతారామపురం గుట్టలే కేంద్రంగా ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పశువుల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం వేళ అపహరించిన పశువులను ఈ గుట్టల మధ్యలో తమ కేంద్రానికి చేరుస్తున్నారు. పదుల సంఖ్యలో పశువులను అపహరించాక రాత్రి వేళల్లో మినీ లారీలు తదితర వాహనాల్లో వాటిని తరలిస్తున్నట్లు బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానాలకు బలం చేకూర్చేవిధంగా గత శుక్రవారం సీతారామపురం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో గుట్టల ప్రాంతంలో పశువులను కట్టేసిన ఆనవాళ్లు, అందుకు ఉపయోగించిన ప్లాస్టిక్ తాళ్లు, అధిక మొత్తంలో ఆ ప్రాంతంలో కనిపించిన పశువుల పేడ, అగంతకులు తాగి పారేసిన మద్యం సీసాలు, నీళ్ల సీసాలు తదితరాలు కనిపించడం గమనార్హం.

ఎందుకింత ఆందోళన..?

గేదెలు పోతే ఇంత ఆందోళనా అని కొందరు అనుకోవచ్చు. కానీ ఒక్కో గేదె విలువ రూ.30 వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. ఒక్కో గేదె ప్రతి రోజూ 10 లీటర్ల వరకూ పాలిస్తోంది. పశు పోషణే ఆధారంగా కుటుంబాలు నెట్టుకొస్తున్నారు వారు. లక్షల రూపాయల విలువ చేసే గేదెలను కోల్పోయి దిక్కు తోచని స్థితిలో రైతులుండగా తల్లి పాలు, ప్రేమకు దూరమైన పసి దూడల పరిస్థితి వర్ణనాతీతం.

రైతుల రాస్తారోకో..

ఈ విషయమై గత శుక్రవారం రాత్రి పాలెఅన్నారం రైతులు కోదాడ - హుజూర్ నగర్ ప్రధాన రహదారిపై తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలానికి చెందని ఓ పోలీస్ అధికారి రైతులతో దురుసుగా ప్రవర్తించారని విశ్వసనీయ సమాచారం. తమ సమ‌స్య పరిష్కరించాల్సింది పోయి తమపైనే దురుసుగా ప్రవర్తించడం ఏంటని రైతులు ఆ అధికారిని నిలదీశారని బాధితులు అంటున్నారు.

సీసీ కేమెరాలు లేవా..

సాధారణంగా ఎంతటి నేరస్తుడైనా పోలీసుల రాడార్ లోంచి తప్పించుకోలేడనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ పశువుల దొంగలను గుర్తించడంలో ఇంత ఉదాసీనత ఏంటని పశు పోషకుల ప్రశ్న. మండలానికి నలు వైపులా కోదాడ, హుజూర్ నగర్, గరిడేపల్లి.. కాస్త ఆనుకునే సూర్యాపేట జిల్లా కేంద్రం ఉంటాయి. అలాంటిది ఎక్కడా సీసీ కేమెరాలు పని చేయడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి వేళ పాట్రోలింగ్ లో కూడా అనుమానితులు, పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలు కనిపించలేదా అని అంటున్నారు. పోలీసులు ఈ విషయాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుని దర్యాప్తు నిర్వహించి తమకు న్యాయం చేయాలని రైతులు, పశు పోషకులు కోరుతున్నారు.

దర్యాప్తు చేస్తున్నాం : ఎస్సై సురబి రాంబాబు


ఈ విషయమై ఎస్సై సురబి రాంబాబును 'దిశ' సంప్రదించగా కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.




Next Story