మున్సి పోరు.. సోషల్ మీడియా హోరు

by Naga Rani Yarlagadda |

మున్సిపల్ ఎన్నికలవేళ చౌటుప్పల్ పుర పరిధిలో ప్రచార పర్వం డిజిటల్ బాట పట్టింది.

మున్సి పోరు.. సోషల్ మీడియా హోరు
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : మున్సిపల్ ఎన్నికలవేళ చౌటుప్పల్ పుర పరిధిలో ప్రచార పర్వం డిజిటల్ బాట పట్టింది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతోపాటు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికలుగా ఆకర్షణీయమైన రీల్స్, లైవ్ ప్రసారాలతో ఓటర్ల మొబైల్ ఫోన్లలోకి నేరుగా చేరుతున్నారు. ప్రతి ప్రధాన పార్టీ ప్రత్యేక సోషల్ మీడియా బృందాలను రంగంలోకి దించి యువతను ఆకట్టుకునేలా వ్యూహాలు రచిస్తోంది. అయితే, నెట్టింట సాగుతున్న తప్పుడు ప్రచారంపై ఎన్నికల అధికారులు డేగ కన్ను వేశారు. నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తుండగా, ఈ డిజిటల్ హోరు ఓటర్ల మనసులను ఎంతవరకు గెలుచుకుంటుందో ఫలితాల రోజే తేలనుంది.

మున్సిపల్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థుల ఇంటింటి ప్రచారానికి తోడు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ప్రధాన వేదికలుగా మారాయి. ప్రతి వార్డులో డజన్ల కొద్దీ వాట్సాప్ గ్రూపులు సృష్టించి ప్రచార సందేశాలు, వీడియోలు, పోస్టర్లు షేర్ చేస్తూ అభ్యర్థులు నేరుగా ఓటర్ల మొబైల్‌ ఫోన్లలోకి చేరుతున్నారు. యువతను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో రూపొందించిన షార్ట్ వీడియోలు, రీల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

క్షణాల్లో ప్రజల్లోకి చేరువ..

అభ్యర్థులు తమ ఇంటింటి ప్రచారాన్ని ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయిస్తూ, తాము మాట్లాడిన ప్రతి మాట క్షణాల్లో వందల మందికి చేరేలా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతి ప్రధాన పార్టీకి ప్రత్యేక సోషల్ మీడియా బృందాలు పనిచేస్తుండగా, వార్డుల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించి ప్రచార కంటెంట్‌ను సమన్వయం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంలోనూ, అభివృద్ధి పనుల వివరణలోనూ ఈ డిజిటల్ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పోస్టులు, కామెంట్లు, ట్రోలింగ్‌తో పుర పరిధిలోని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఫేక్ ప్రచారంపై అధికారుల నిఘా..

అయితే, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాత వీడియోలను కొత్తవిగా చూపించడం, తప్పుడు ఆరోపణలతో పోస్టులు చేయడం వంటి ఘటనలపై ఎన్నికల అధికారులు నిఘా పెట్టారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించి తప్పుడు ప్రచారం చేసే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ 'డిజిటల్ ప్రచారం' ఓటర్ల మనసులను ఎంతవరకు గెలుచుకుంటుందనేది ఫలితాల రోజే తేలనుంది.

Next Story