ఆడపిల్లకు బతుకేది.. కడుపులోనే చిదిమేస్తున్న కసాయిలు..!

by Ratna Kumari |

దిశ, చిట్యాల : మహిళలు ఒకవైపు ప్రపంచ క్రికెట్ లో, ఒలంపిక్ లో, రాజకీయాల్లో, వివిధ రంగాల్లో సాగిస్తున్న విజయపరంపర ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటే.. మరోవైపు ఆడపిల్లల పుట్టుకపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఆడపిల్లకు బతుకేది.. కడుపులోనే చిదిమేస్తున్న కసాయిలు..!
X

దిశ, చిట్యాల : మహిళలు ఒకవైపు ప్రపంచ క్రికెట్ లో, ఒలంపిక్ లో, రాజకీయాల్లో, వివిధ రంగాల్లో సాగిస్తున్న విజయపరంపర ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటే.. మరోవైపు ఆడపిల్లల పుట్టుకపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు గర్భంలోనే చిదిమేస్తున్నారు. దీన్ని నివారించేందుకు 1994లోనే అన్ని దవాఖానల్లో లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లింగ నిర్ధారణ చట్టాన్ని తీసుకొచ్చాయి. అయినప్పటికీ కాసుల‌కు కక్కుర్తిపడి కొందరు వైద్యులు అడ్డదారుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తుండడంతోపాటు భ్రూణహత్యలకు కారణమవుతున్నారు. అధికార యంత్రాంగం అలసత్వంతో చట్టాలు అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చిట్యాలలో మచ్చుకు కొన్ని..

ఇటీవల చిట్యాల పట్టణ కేంద్రంలో వెలుగుచూసిన లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తున్నది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు కలిగిన మహిళ మరోసారి గర్భం దాల్చి గర్భ నిర్ధారణ పరీక్షలు చేసుకొని తన కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియడంతో చిట్యాలలో ఓ ప్రైవేట్ వైద్య చికిత్స కేంద్రానికి అబార్షన్ కోసం రావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేశారు. అలాగే 2021లో పెద్దకాపర్తి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని జిల్లా వ్యాప్తంగా అక్కడికి గర్భవతులైన మహిళలను తీసుకువచ్చి మొబైల్ స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవాడు. దీనిపై కొద్ది కాలానికి కేసు నమోదు కావడంతో ఈ సంఘటనలో వైద్యశాఖలో పని చేసే వైద్యులు, ఉద్యోగులు, ఆర్ఎంపీ వైద్యులు దోషులుగా తేలారు. అలాగే చిట్యాల పట్టణ కేంద్రంలోని సర్వీస్ రోడ్డుపై 5 నెలల గర్భస్థ పిండం ప్రత్యక్షమైన సంఘటన కూడా వెలుగు చూసింది. అలాగే మండలంలోని బోయగుబ్బ గ్రామంలో గుర్తు తెలియని మహిళ ఆడ శిశువును ప్రసవించి చెట్ల పొదల్లో విడిచి వెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

అబార్షన్ కు గల కారణాలపై అవగాహన ఏది..

చిట్యాల మండలంలో అడపా దడప ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడంలో విఫలం అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు, బాలికలపై చిన్నచూపు, అబ్బాయి కావాలనే కోరిక, ప్రజల్లో అవగాహనారాహిత్యం తదితర కారణాలతోనే మహిళలు గర్భవిచ్ఛిత్తికి సిద్ధమవుతున్నారనేది తెలుస్తుంది. అలాగే పెళ్లి కానీ మైనర్ బాలికలు మహిళలు ప్రేమ, ఆకర్షణకు లొంగి అవగాహన రాహిత్యంతో గర్భం దాల్చడం మూలంగా అబార్షన్ కు పాల్పడుతున్నారు. దీనిపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్యశాఖ సిబ్బంది మహిళలు బాలికలకు సరైన అవగాహన కల్పించడంలో విఫలం అవుతున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి..

కాసులకు కక్కుర్తి పడి అబార్షన్లు..

ఓ వైపు అన్ని దవాఖానల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నియంత్రించినా అదనపు డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు వైద్యులు అడ్డదారుల్లో ఈ కేంద్రాలు నడుపుతూ శిశువుల ఊపిరి తీసేందుకు దోహదపడుతున్నారు. ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన జిల్లా అధికార యం త్రాంగం, వైద్యారోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం విడ్డూరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతున్న కారణంగా గర్భిణులు పలువురు అర్హతలేని స్థానిక వైద్యులు, దవాఖానల సహకారంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుని గర్భ విచ్ఛిత్తికి పాల్పడుతున్నారు.

మధ్యవర్తులతో దందా

బాలికల సంరక్షణ కోసం పాలక ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా అవగాహనారాహిత్యంతో అమ్మాయిలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మరో వైపు బాలికల సంరక్షణ కోసం చట్టాలున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. పలువురు ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఈ విషయంలో పలు దవాఖానలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ మహిళల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. .

వాళ్లపై నిఘా ఏది..?

జిల్లాలో మాతాశిశు సంరక్షణ కోసం కృషి చేయాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఇతర అనుబంధ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. మొదటిసారి కుమార్తెను ప్రసవించి, రెండోసారి గర్భం దాల్చిన వారిపై ఎక్కువ నిఘా పెట్టాలి. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు సూపర్‌ వైజర్ల ద్వారా వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉన్నా ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని ఈ సంఘటనల ఆధారంగా తెలుస్తున్నది. గర్భం దాల్చిన తరువాత ఎన్ని సార్లు స్కానిం గ్‌ తీయించుకున్నారు ? ఎక్కడ తీయించుకున్నారు ?అనే వివరాలు ప్రతి నెలా రికార్డుల్లో పొందుపర్చాలి. అలాగే స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు కూడా ప్రతి నెల తమ కేంద్రానికి స్కానింగ్ నిమిత్తం వచ్చే మహిళల సమాచారం అధికారులకు ఇవ్వని స్కానింగ్‌ సెంటర్లపై పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేయడం అనుమానాలకు తావిస్తున్నది...

Next Story