- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూమిలో కరిగిపోయే సంచులను ప్రోత్సహించాలి : బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారేత్ విన్ ఓవెన్
పర్యావరణాన్ని రక్షించేందుకు రమణి ఇండస్ట్రీస్ లో భూమిలో కరిగిపోయే సంచులు తయారు చేయడం అభినందనీయమని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారేత్ విన్ ఓవెన్ అన్నారు.

దిశ, చౌటుప్పల్ టౌన్ : పర్యావరణాన్ని రక్షించేందుకు రమణి ఇండస్ట్రీస్ లో భూమిలో కరిగిపోయే సంచులు తయారు చేయడం అభినందనీయమని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారేత్ విన్ ఓవెన్ అన్నారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా మట్టిలో కరిగిపోయే సంచులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం హరిత పారిశ్రామిక పార్కులోని రమణి బయో కాంపోస్టికా పరిశ్రమను సోమవారం ఆయన సందర్శించారు. డీఆర్ డీవో శాస్త్రవేత్తలు అందించిన సాంకేతిక సహకారంతో రమణి, డాక్టర్ ప్రసాద్ లు నెలకొల్పిన రమణి ఇండస్ట్రీస్ లో బయో డి గ్రేడబుల్ సంచులను తయారు చేసే ప్రక్రియను ఆయన పరిశీలించారు. మొక్కజొన్న పొట్టుతో తయారయ్యే గ్రాన్యూల్స్ ను ఉపయోగించి వివిధ రకాల క్యారీ బ్యాగులను, రైతులు ఉపయోగించే మల్చింగ్ షీట్లను తయారు చేసే యంత్రాలను, వాటి నుంచి తయారు చేసిన సంచులను, ఆ సంచులపై సంస్థల పేర్లను ముద్రించే పద్ధతిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యాపారం కోసం కాకుండా సమాజానికి, పర్యావరణానికి మేలు జరిగే విధంగా తమ వంతు కృషి చేయాలనే సంకల్పంతో ఈ పరిశ్రమను స్థాపించామని రమణి, డాక్టర్ ప్రసాద్ లు వివరించారు. ఈ సంచులను ఉపయోగించి భూమిలో ఎక్కడ పడవేసిన 90 రోజులలో మట్టిలో కరిగిపోయి భూమికి ఎరువుగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో తాము స్వయం ఉపాధి పొందడంతో పాటు ఈ ప్రాంతంలోని కొంతమందికి పని కల్పిస్తున్నామని తెలిపారు. బయో డిగ్రేడబుల్ ఉత్పత్తులను ప్రోత్సహించి తమకు సహకారం అందించాలని కోరారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారేత్ విన్ ఓవెన్
రమణి ఇండస్ట్రీస్ లో తయారవుతున్న బయో డిగ్రేడబుల్ సంచులను ప్రోత్సహించి ఎగుమతి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను విరివిగా వాడుకుని పడేస్తే అవి భూమిలో కరగడానికి వందల సంవత్సరాలు పడుతుందని.. దీంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు. వాటికి ప్రత్యామ్నాయంగా కొన్ని రోజుల్లోనే భూమిలో కరిగిపోయే బయో డీగ్రేడబుల్ బ్యాగులు ఉత్పత్తి, వినియోగం జరగాలన్నారు. సామాజిక సేవా దృక్పథంతో బయో డిగ్రేడబుల్ బ్యాగుల తయారీ పరిశ్రమను నెలకొల్పిన రమణి డాక్టర్ ప్రసాద్ లను ఆయన అభినందించారు. వీటి మార్కెటింగ్ కు ఎగుమతులకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. టిఫ్ కార్యాలయానికి వెళ్లి హరిత పారిశ్రామిక పార్కు విశేషాలను తెలుసుకున్నారు. టిఫ్ మేనేజర్ శ్రీకాంత్ హరిత పారిశ్రామిక పార్కు ప్రగతిని వివరించారు.
భారతీయ హస్తకళలు అద్భుతం, భారతీయ హస్తకళలు అద్భుతమైనవని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గానేత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం టెక్స్ టైల్ పార్కులోని మిమీ క్రాఫ్ట్స్ హస్తకళల కేంద్రాన్ని ఆయన సోమవారం సందర్శించారు. అక్కడ గిరిజన కళతో తయారుచేసిన అలంకరణ వస్తువులను పరిశీలించారు. ప్రాచీనమైన "బాతిక్ " పద్ధతిలో వస్త్రాలకు మైనాన్ని పూసి వివిధ రకాల ఆకృతులతో రంగులు అద్ధి ఫ్యాషన్ వస్త్రాలు తయారుచేసి పద్ధతిని తిలకించారు. భారతీయులు పూర్వకాలం నాటి పద్ధతిలో పత్తితో నేసిన నూలుపై టై అండ్ డై, స్క్రీన్, బ్లాక్ ప్రింటింగ్ చేసి చీరలు, డ్రెస్ మెటీరియల్ తయారు చేస్తున్న హస్త కళాకారుల పనితనాన్ని పరిశీలించారు. తాను స్వయంగా బ్లాక్ ను చేత పట్టుకొని రంగులో ముంచి వస్త్రంపై ప్రింటింగ్ వేసి భారతీయ హస్తకళలపై తన అభిమానాన్ని చాటుకున్నారు. హస్త కళాకారులను, ప్రాచీన హస్తకళలకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్న కృష్ణమూర్తి, పుష్పలత లను ఆయన అభినందించారు. భారతీయ హస్తకళల గురించి తనకు పరిచయం చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిమి క్రాఫ్ట్స్ నిర్వాహకుడు, ఫ్యాషన్ డిజైనర్ కే. కృష్ణమూర్తి మాట్లాడుతూ, భారతీయ హస్త కళలు ఎంతో ప్రాచీనమైనవని, విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. యాంత్రీకరణ, పారిశ్రామికీకరణ పెరిగినా కూడా ఈ భారతీయ హస్త కలలకు గౌరవం పెంచేందుకు, ఇవి అంతరించిపోకుండా కాపాడేందుకు ప్రాచీనతకు, ఆధునికతను జోడించి తన వంతు కృషి చేస్తున్నట్టు చెప్పారు. మిమీ క్రాఫ్ట్స్ నిర్వాహకురాలు పుష్పలత బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ను హస్తకళ శాలువాతో సన్మానించారు.






