- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధరణితో ప్రభుత్వ భూములు దోచుకున్నారు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి
గత ప్రభుత్వం ప్రభుత్వ, అసైన్డ్ భూములను దోచుకునేందుకు ధరణి చట్టాన్ని తీసుకువచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

దిశ, సంస్థాన్ నారాయణపురం: గత ప్రభుత్వం ప్రభుత్వ, అసైన్డ్ భూములను దోచుకునేందుకు ధరణి చట్టాన్ని తీసుకువచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పేదల భూములు కాపాడేందుకే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, రాత్రికి రాత్రి ధరణి చట్టం తీసుకువచ్చి భూ సమస్యలు,ఆత్మహత్యలు పెరిగేలా గత ప్రభుత్వం పని చేసిందని ఆరోపించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో భూభారతి చట్టం పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యములతో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడుతూ .. రాచకొండలో పేద రైతులకు ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని భూభారతి చట్టంతో ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. ఇకపై పేద రైతులకు వేధింపులు ఉండొద్దని భూభారతి చట్టంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నదని అధికారులు ఆ వైపుగా పనిచేయాలని సూచించారు. తాను ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తినని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో పైసలు లేకుంటే పనులు జరగవనే ఆరోపణలు వస్తున్నాయని ఇలాంటి విషయాలు తన దృష్టికి వస్తే ఇక చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు.
గతంలో పనిచేసిన తహసిల్దార్ ఒక మాఫియాలా తయారై రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు తన దృష్టికి వచ్చిందని పేదల జోలికి పోవద్దని ఆయన సున్నితంగా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తమ బతుకులు బాగుపడతాయి అనుకుంటే పదేళ్లలో వారి సమస్యలు మరింత ఎక్కువ అయ్యాయని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో మునుగోడు నియోజకవర్గానికి నల్లగొండ జిల్లాకు ఒక్క చుక్క నీరు అందలేదని నలగొండకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో మునుగోడు లోని 1,75,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళిక సిద్ధం అయ్యిందని, సంస్థాన్ నారాయణపురం చౌటుప్పల్ మండలాలకు నీటి సమస్యను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే సభాముఖంగా ప్రకటన చేశారని అన్నారు. రాచకొండ రిజర్వాయర్ ను ఏర్పాటు చేసి నారాయణపురం,చౌటుప్పల్ మండలాలను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. కాలుష్యంతో నిండిన మూసి నీళ్లను రానివ్వనని కృష్ణా నీటి తోనే ఈ రెండు మండలాలు సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డైనమిక్ గా పనిచేస్తున్నారని ఆయన కలెక్టర్ ను అభినందించారు.
అన్యాకాంతమైన ప్రభుత్వ భూములు కాపాడాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.
భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ... నిరంకుశ ధరణికి భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ నుండి ఎన్నో చట్టాలు తీసుకువచ్చిన నేటికీ భూ సమస్యలు తీరలేదని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో భూ సమస్యలు తీరుతాయనుకుంటే ధరణితో మరింత జటిలం అయ్యాయని అన్నారు. ధరణిలో కబ్జాకాలం తీసివేయడంతో గ్రామాలలో భూ సమస్యలు విపరీతంగా పెరిగాయని , సమస్యలు పరిష్కరించేందుకు అధికారులకు ధరణిలో అధికారాలు లేకుండా చేశారని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకురావడం హర్షించదగ్గ విషయం అన్నారు. తాము భూభారతి చట్టాన్ని స్వాగతిస్తున్నామని దీనితో భూ సమస్యలు పరిష్కారం కావాలని ఆయన ఆకాంక్షించారు. సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని రాచకొండలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వాటిని పరిరక్షించేందుకు అధికారులు పనిచేయాలని సూచించారు. అదేవిధంగా అటవీశాఖ అధికారులతో రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకొని రాచకొండ భూ సమస్యలను పరిష్కరించి పేద రైతులకు న్యాయం జరిగేలా పనిచేయాలని అన్నారు. జిల్లాలో భూభారతి పైలెట్ ప్రాజెక్టుగా సంస్థాన్ నారాయణపురం మండలాన్ని ఎంపిక చేసి రాచకొండలోని భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాచకొండలో కబ్జాకు గురైన 10% గ్రామపంచాయతీ భూములను సంరక్షించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. వ్యవసాయ యోగ్యమైన భూములను ప్రభుత్వ అవసరాలకు తీసుకోకుండా వ్యవసాయ యోగ్యం కాని భూములనే ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. నియోజకవర్గంలో సాగునీరు కోసం స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..భూభారతి చట్టంపై అవగాహన కల్పించాకే అమలు చేస్తున్నామని హడావిడిగా ప్రజలపై రుద్దడం లేదని అన్నారు. 14 నెలల మేదో మధనం తర్వాతే భూభారతి చట్టాన్ని అమలు చేశామని 23 సెక్షన్లు 19 రూల్స్ తో అతి చిన్న చట్టంగా భూభారతి రూపుదిద్దుకుందని అన్నారు. మే ఒకటి తర్వాత అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ధరణి కష్టాలకు పుల్ స్టాప్ పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






