విషపూరిత పాల వ్యాపారం భగ్నం.. మన్నెవారుపంపులో కల్తీ మాఫియా అరెస్ట్

by Bhanu |

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెవారూపంపు గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిపై గురువారం భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

విషపూరిత పాల వ్యాపారం భగ్నం.. మన్నెవారుపంపులో కల్తీ మాఫియా అరెస్ట్
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెవారూపంపు గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిపై గురువారం భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో జరిగిన ఈ ఘటనలో, సామల సత్తిరెడ్డి అనే వ్యక్తి ఇంటి వద్ద కల్తీ పాలను తయారు చేస్తూ, వాటిని హైదరాబాద్‌కి సరఫరా చేస్తున్నాడని భువనగిరి రూరల్ ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.

ఉదయం 6 గంటల ప్రాంతంలో అందిన సమాచారం ఆధారంగా పోలీసులు గ్రామంలో తనిఖీలు చేపట్టి, ఘటనాస్థలంలో 80 లీటర్ల కల్తీ పాలు, 5 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు, 500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 400 మిల్లీలీటర్ల ఎసిటిక్ యాసిడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి హానికరమైన ఈ కల్తీ పదార్థాలతో వ్యాపారం చేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కల్తీ పాల ఉత్పత్తిపై నిషేధం విధించామని, ఈ తరహా చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై అనిల్ కుమార్ హెచ్చరించారు.

Next Story