ప్రోటోకాల్ పాటించని ఈవోపై చర్యలు తీసుకోవాలి : గొంగిడి

by Naveena |

ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ ను విస్మరించిన యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కరరావుపై చర్యలు తీసుకోవాలని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రోటోకాల్ పాటించని ఈవోపై చర్యలు తీసుకోవాలి :  గొంగిడి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ ను విస్మరించిన యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కరరావుపై చర్యలు తీసుకోవాలని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం యాదగిరికొండపైన ఈవోను కలిసి ప్రోటోకాల్ ఎలా విస్మరిస్తారని భాస్కరరావును ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరిగుట్టకు గవర్నర్ రావడం సంతోషకరమన్నారు. ఈవో‌ ప్రోటాకల్ పాటించకుండా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారని, గత నలబై యెండ్ల నుంచి జరగని సంఘటనలు ఇప్పుడు చోటు చేసుకున్నాయన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులు,‌ఎమ్మెల్యేలు,‌ఎంపీలు తలంబ్రాలు తెస్తారని, కానీ వార్డు మెంబర్ కాని వ్యక్తి, ఎమ్మెల్యే సోదరుడు, కాంగ్రెస్ జిల్లా‌ నాయకుడు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఎలా తెస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ‌ ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ పదవులలో ఉన్నవారే తీసుకురావాలన్నారు. ఈవో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కళ్యాణోత్సవానికి విచ్చేసిన శాసనసభ ఎమ్మెల్సీ కొటిరెడ్డిని ఆలయ ఈవో అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ‌లేని వ్యక్తులు ప్రభుత్వ లంచానాలతో ఏ విధంగా తీసుకువస్తారో సమాధానం ఈవో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈవో మీద చర్య తీసుకోకపోతే ఆందోళన చేస్తాం

కళ్యాణోత్సవం సందర్భంగా రూ. 70 లక్షలు ఇస్తే కనీసం ఆహ్వానం అందించలేదని అన్నారు. కాంగ్రెస్ వాళ్లను ముందు వరుసలో ఎలా కూర్చొబెడతారని ప్రశ్నించారు. ‌కేసీఆర్ వందల కోట్లతో యాదగిరిగుట్టను తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దారని చెప్పారు. ‌ఆఖరికి ఆయనను కూడ అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ ను ఈవో పిలవొద్దు అనుకున్నారని, చిన జీయర్ సలహా మేరకు మాత్రమే అర్చకులు, అధికారులు మాత్రమే వెళ్లి కేసీఆర్ దగ్గరికి వెళ్లారన్నారు. అర్చకులు కేసీఆర్ కు ఆశీర్వాదం అందిస్తే, ఈవో అర్చకుల మీద ఆగ్రహాం వ్యక్తం చేయడం ఏమిటని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాలు నిర్వహణలో ఈవో పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ‌బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పడు అన్ని పార్టీలకు సమానంగా కళ్యాణోత్సవం పాస్ లను అందించామని,‌ కాని కాంగ్రెస్ పాలనలో పూర్తి వివక్ష ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ‌మూడు సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన ఒక రూపాయి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు.

ఈవో భాస్కరరావు స్పందిస్తూ ఆరోపణలు ‌పూర్తిగా అవాస్తమని, బ్రహ్మోత్సవాల సమయంలో ఎవరిని ఎలాంటి అవమానాలకు గురి చేయలేదన్నారు. కళ్యాణం సమయంలో డోనర్లకు అందరికి ఆహ్వానం అందించామని, ఆహ్వానం విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, నాయకులు వంటేరు సురేష్ రెడ్డి, తోటకూరి బీరయ్య, కసావు శ్రీనివాస్, పేరబోయిన సత్యనారాయణ, కవిడే మహేందర్, బీమాగాని నర్సింహ్మ, ఆవుల సాయి, ముక్కెర్ల‌ సతీష్, ముక్కెర్ల వీరేశం, షేక్ దావుద్, బండి వాసు తదితరులు పాల్గొన్నారు.

Next Story