- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ ఏజెన్సీల దోపిడీ...రూ.25వరకు అదనపు బాదుడు
భూదాన్ పోచంపల్లి మండలంలో గ్యాస్ సిలిండర్ డెలివరీపై అక్రమ వసూళ్లు జోరుగా సాగుతున్నాయి.

గ్యాస్ ఏజెన్సీల దోపిడీ
సిలిండర్‌పై అదనపు వసూళ్లు
డెలివరీ చార్జీల పేరుతో సామాన్యుడి జేబుకు చిల్లు..
రూ.25వరకు అదనపు బాదుడు
డిజిటల్ పేమెంట్లకు నో.. నగదు రూపంలోనే దందా
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
భూదాన్ పోచంపల్లి మండలంలో గ్యాస్ సిలిండర్ డెలివరీపై అక్రమ వసూళ్లు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో సిలిండర్‌పై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రూ.25వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. డెలివరీ బాయ్స్ ద్వారా సామాన్య వినియోగదారులను ఏజెన్సీలు నిలువునా దోచుకుంటున్నాయి. డిజిటల్ పేమెంట్లను నిరాకరిస్తూ, కేవలం నగదు రూపంలోనే దందా సాగిస్తున్నారు. అక్రమ వసూళ్లపై ప్రశ్నిస్తే ‘డబ్బులు ఆఫీసుకే పోతాయి’ అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారు. పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ అదనపు బాదుడు పెను భారంగా మారింది. అధికారులు తూతూమంత్రంగా వ్యవహరిస్తుండడంతో ఏజెన్సీల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. వెంటనే స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.
దిశ, భూదాన్ పోచంపల్లి : గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే డెలివరీ చార్జీల పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేస్తూ సామాన్యుడిపై భారం మోపుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరచూ సిలిండర్ ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుంటే, స్థానికంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ బాయ్స్ రూపంలో మరో విడత దోపిడీకి తెరలేపాయి. ఒక్కో సిలిండర్‌పై బిల్లు కంటే సుమారు రూ.25వరకు అదనంగా బాదేస్తూ ఏటా కోట్లాది రూపాయలను వినియోగదారుల నుంచి అక్రమంగా దండుకుంటున్నాయి.
కమీషన్ వస్తున్నా ఆగని బాదుడు!
నిజానికి గ్యాస్ సిలిండర్లను ఇంటికి చేరవేసినందుకు సంబంధించి చమురు సంస్థలు గ్యాస్ ఏజెన్సీలకు కమీషన్ చెల్లిస్తాయి. వినియోగదారుడు కట్టే బిల్లులోనే ఈ డెలివరీ రుసుము కలిసి ఉంటుంది. కానీ, ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం అది చాలదన్నట్లుగా డెలివరీ బాయ్స్ ద్వారా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. డబ్బులు ఇవ్వని పక్షంలో సిలిండర్లు ఇవ్వమని మొండికేస్తుండడంతో చేసేదేమీ లేక వినియోగదారులు అదనపు మొత్తాన్ని సమర్పించుకుంటున్నారు.
నగదుకే ప్రాధాన్యత!
ఈ అక్రమ వసూళ్లు బయటపడకుండా ఉండేందుకు ఏజెన్సీలు కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. ఆన్‌లైన్ లేదా ఫోన్ పే ద్వారా నగదు చెల్లిస్తే అదనపు వసూళ్లకు ఆధారాలు దొరుకుతాయని భావించి, కేవలం నగదు రూపంలోనే చెల్లించాలని వినియోగదారులను వేధిస్తున్నాయి. ‘మాకు సంబంధం లేదు.. ఈ పైసలన్నీ ఆఫీసుకే పోతాయి’ అంటూ డెలివరీ బాయ్స్ చెప్పే సమాధానాలు వింటే ఏజెన్సీల నిర్వాహకుల కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తోందని స్పష్టమవుతోంది. అదనంగా వసూలు చేసే మొత్తానికి ఎలాంటి రశీదులు ఇవ్వకపోవడం ఈ దోపిడీకి పరాకాష్ట.
అధికారుల మౌనం.. వినియోగదారుల ఆవేదన
ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీల వద్ద సిలిండర్ ధర సుమారు రూ.965 ఉండగా, డెలివరీ చేసే సమయానికి అది దాదాపు రూ.వెయ్యి చేరుతోంది. పర్యవేక్షణ లోపం వల్లే డెలివరీ బాయ్స్ బరితెగిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, గ్యాస్ ఏజెన్సీల అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






