నల్గొండను రెండేళ్లలో ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దుతా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-18 12:58:16  IST  )

మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి నల్లగొండ పట్టణాభివృద్ధికి నడుంబిగించారు. రూ. 900 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఇవాళ ఆయన శంకుస్థాపన చేశారు.

నల్గొండను రెండేళ్లలో ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దుతా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్/నల్లగొండ టౌన్: నల్గొండ పట్టణాన్ని రాబోయే రెండేళ్లలో అద్భుతమైన స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది, అసలైన అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాబోయే పదేళ్లలో నల్గొండను ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో శాంతి సామరస్యాలు నెలకొల్పడమే తన లక్ష్యమని, గంజాయి, రౌడీయిజం వంటి అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు.

అభివృద్ధి పనులు శరవేగంగా..

నల్లగొండలో రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి కొమటిరెడ్డి తెలిపారు. లతీఫ్ సాబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టలకు ఘాట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. పట్టణంలో లో-వోల్టేజ్ సమస్య లేకుండా 8 సబ్ స్టేషన్ల నిర్మాణం, పాత లైన్ల మార్పిడి జరుగుతోందని పేర్కొన్నారు. 24 గంటల పాటు నీటి సరఫరా అందించేలా కొత్త ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ‘బొట్టు గూడా’పాఠశాల తరహాలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.20 కోట్లతో న్యాక్ (NAC) భవనం, రూ.84 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం పనులు పూర్తయ్యాయని మంత్రి వివరించారు.

అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం

పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, శానిటేషన్, పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు తమ డివిజన్ల సమస్యలను పరిష్కరించాలని, తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా పనులే ముఖ్యమని భావించి పనిచేయాలని ఆయన సూచించారు. పట్టణంలోని పద్మావతి కాలనీలో రూ.80 లక్షల వ్యయంతో, శివాజీ నగర్‌లో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న పార్కు పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ఎస్ఎల్బీసీ (SLBC) ప్రాజెక్టు లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయని, బ్రాహ్మణవెల్లంల ద్వారా సాగునీరు అందిస్తున్నామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Komatireddy: రీజినల్ రింగ్ రోడ్డు గేమ్‌ ఛేంజర్.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Next Story