CM రేవంత్‌ను కలిసిన నల్గొండ MP రఘువీర్ రెడ్డి

by Gantepaka Srikanth |

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్వహించే పెద్దగట్టు(Peddagattu Jathara) జాతరకు భారీగా నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి(MP Raghuveer Reddy) కోరారు.

CM రేవంత్‌ను కలిసిన నల్గొండ MP రఘువీర్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్వహించే పెద్దగట్టు(Peddagattu Jathara) జాతరకు భారీగా నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి(MP Raghuveer Reddy) కోరారు. గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి ఈ మేరకు విన్నవించారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 16 నుంచి పెద్దగట్టు జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లకు కావాల్సిన నిధుల ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జాతరకు దేశవ్యాప్తంగా భారీగా భక్తజనం తరలిరానున్న నేపథ్యంలో మౌలిక వసతులు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయనున్నారు. గత ప్రభుత్వాల హయాంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఈసారి శాశ్వత ప్రాతిపదికన పనులు చేయాలని సూచించారు.

అవసరమైన చోట సీసీ రోడ్లు వేయాలని తెలిపారు. ఎంపీ రఘువీర్ రెడ్డి కి యాదవ సంఘం నాయకులు, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌని రాజారామ్ రమేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పెద్దగట్టు జాతరకు సౌకర్యాలు కల్పించేలా నిధులు విడుదల చేయాలని ఎంపీ గారిని కోరుతూ వినతి పత్రం సమర్పించడంతో వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెద్దగట్టు జాతర కు నిధులు విడుదల చేయాలని కోరారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అధికారులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

కాగా, ఈ జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని.. ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్‌పల్లిగా పేరొందినట్లు భక్తులు నమ్ముతారు. దురాజ్‌పల్లికి సమీపంలో ఉండ్రుగొండ గ్రామం ఉంది. దీని శివారులో ఏడెనిమిది కొండగుట్టలున్న అటవీప్రాంతం ఉంది. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై ఈ జాతర జరిగేదట.

ఈ దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర రాష్ట్రంలో రెండో పెద్ద జాతర. లింగమంతులస్వామి యాదవుల ఆరాధ్యదైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల కుట్టిన లాగులు ధరించి కాళ్లకు గజ్జెలు, చేతిలో అవుసరాలు పట్టుకుని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ‘ఓ లింగా.. ఓ లింగా..’ అంటూ హోరెత్తిస్తారు. అత్యంత వైభవంగా ప్రతీ సంవత్సరం ఈ జాతర నిర్వహిస్తుంటారు.

Next Story