నాడు చంద్రబాబు.. నేడు ఏక్‌నాథ్ షిండే ఆ విషయంలో సేమ్ టు సేమ్

by Disha Web Desk 4 |
నాడు చంద్రబాబు.. నేడు ఏక్‌నాథ్ షిండే ఆ విషయంలో సేమ్ టు సేమ్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనూహ్యంగా తన పార్టీ పేరును, గుర్తును కోల్పోయారు. శివసేన పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు 'విల్లు - బాణం' సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని చీలిక వర్గానికే చెందుతుందని ఈసీ తాజాగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పగ్గాలు, పార్టీ పేరు, ఎన్నికల గుర్తు మొత్తం ఏక్ నాథ్ షిండే చేతుల్లోకి వెళ్లిపోయాయి.

1998 నుంచి 2019 వరకు శివసేన బీజేపీతో ఎన్డీఏ కూటమిలోనే కొనసాగింది. 2019 ఎన్నికల అనంతరం అనూహ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టి ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. అప్పటినుంచి ఉద్ధవ్ ఠాక్రేపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ దెబ్బ తీసేందుకు అదును చూస్తూ వచ్చింది. తమతో కాకుండా తమ ప్రత్యర్థులతో కలవడంతో పార్టీలో చీలిక తెచ్చి ఆ చీలికతో పొత్తు పెట్టుకుని మహారాష్ట్రలో బీజేపీ తన ప్లాన్ వర్క్ అవుట్ చేసింది.

హిందుత్వ ఎజెండాతో ఏర్పడిన పార్టీ సెక్యూలర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఏంటని 2019 ఎన్నికల అనంతరం మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా చర్చ సాగింది. అయినా వాటిని లెక్క చేయకుండా ఉద్ధవ్ ఠాక్రే తన పని తాను కానిచ్చుకుంటూ పోయారు. కానీ పార్టీలో అంతర్గతంగా తనపై ఉన్న వ్యతిరేకతను పసిగట్టలేకపోయారు. దీంతో ఏక్ నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇస్తూ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలతో సొంతంగా క్యాంపు ఏర్పాటు చేసి అనూహ్యంగా సీఎం పీఠం ఎక్కారు.

ఆనాడు చంద్రబాబు..

అయితే ఈ ఘటనతో తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. అనాడు తెలుగుదేశం పార్టీలోనూ సేమ్ ఇదే సీన్ కనిపించింది. లక్ష్మీ పార్వతి కారణంగా పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని ఆమె చెప్పినట్లే ఎన్టీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించిన చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలకు తెర లేపారు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయకత్వంలో మెజార్టీ ఎమ్మెల్యేలు జత కట్టారు.

ఓ హోటల్‌లో మకాం వేసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఆ హోటల్ ముందు ధర్నా చేస్తే ఆయనపైనే చెప్పులు విసిరారు. పార్టీ పెట్టింది.. గెలిపించుకుంది ఎన్టీఆర్ అయినా తన మాట వినడం లేదని చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేలంతా చంద్రబాబు పక్షనా నిలవడంతో పార్టీతో పాటు ప్రభుత్వం చంద్రబాబు వశమైంది. మెజార్టీ ఆధారంగా పార్టీ పేరు, సైకిల్ గుర్తు చంద్రబాబుకే ఎన్నికల సంఘం కేటాయించింది. 1995లో జరిగిన ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

సేమ్ టు సేమ్ అదే సీన్‌ను తలిపిస్తూ శివసేన మొత్తం ఏక్ నాథ్ షిండే చేతుల్లోకి వెళ్లిపోయింది. తొలుత సీఎం పదవి దక్కించుకున్న ఏక్ నాథ్ షిండే తాజాగా శివసేన పేరు, పార్టీ ఎన్నికల గుర్తు తనకే దక్కడంతో ఇక ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి ఏంటనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జోరందుకుంది. ఉద్ధవ్ ఠాక్రే మాత్రం ఈ‌సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్తానని ప్రకటించారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే భవిష్యత్తును కాలమే నిర్ణయించాలి.


Next Story

Most Viewed