మావోయిస్టు పార్టీలో మిస్టరీ డాక్టర్.. లొంగిపోయిన మావోయిస్టు సమాచారం ఇవ్వడంతో..

by Prasad Jukanti |   (  Updated:2025-12-29 15:12:01  IST  )

ఎంబీబీఎస్ విద్యను అభ్యసించి ఉద్యమస్ఫూర్తితో అడవిబాట పట్టిన ఓ వైద్యుడి గురించి ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది.

మావోయిస్టు పార్టీలో మిస్టరీ డాక్టర్.. లొంగిపోయిన మావోయిస్టు సమాచారం ఇవ్వడంతో..
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీలో వరుస లొంగుబాట్లు తీవ్ర చర్చనీయాశంగా మారిన సంగతి తెలిసిందే. అడవుల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడం, భద్రతాదళాల దుందుడుకు చర్యలతో పార్టీ అగ్రనేతలు సైతం సరెండర్ల బాట పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించి ఉద్యమస్ఫూర్తితో అడవిబాట పట్టిన ఓ వైద్యుడి గురించి ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. లగ్జరీ ఆసుపత్రుల్లో ఏసీ రూమ్‍ల్లో వైద్యం ప్రాక్టిస్ చేయాల్సిన ఆయన కనీస సదుపాయాలు లేని దండకారణ్యంలో ఎంతో మంది మావోయిస్టుల పాలిట దేవుడిగా మారారు. నిఘా వర్గాలకు సైతం చిక్కకుండా ఏళ్లతరబడి పని చేస్తూ మావోయిస్టు పార్టీలో మిస్టరీ డాక్టర్‍గా నిలిచిపోయారు. దశాబ్దం క్రితం ఆయన పేరు తొలిసారి భద్రతా దళాలకు చేరినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఓ రహస్యంగానే మిగిలిపోయారు. తాజాగా లొంగిపోయిన ఓ మావోయిస్టు ఆయన గురించి మీడియాకు సమాచారం వెల్లడించడంతో సదరు మిస్టరీ డాక్టర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది.

మావోయిస్టులకు శిక్షణ:

నిఘా వర్గాలకు చిక్కకుండా ఏళ్లకు ఏళ్లు తప్పించుకుని తిరుగుతున్న ఆ డాక్టర్ పేరే రఫీక్ అలియాస్ మణ్‍దీప్. పంజాబ్‍కు చెందిన రఫీక్ ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత సీపీఐ (మావోయిస్టు) పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. దాంతో కొన్నేళ్ల పాటు దళంలో ఉండి ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో గల దండకారణ్యంలో వైద్య వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఎన్ కౌంటర్లతో పాటు ఆయా సందర్భాల్లో గాయపడిన, అనారోగ్యం పాలైన మావోయిస్టులకు వైద్యం అందించడంతో పాటు దళంలోని సభ్యులకు, స్థానికులకు ప్రథమ చికిత్స, బుల్లెట్లు బయటకు తీయడం, తూటాల గాయాలకు కుట్లు వేయడం వంటి చికిత్సలపై శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం. అలా అబజ్ మఢ్ లోని మావోయిస్టు హెడ్ క్వార్టర్స్ జోన్ లో రఫీక్ అనేక మంది మావోయిస్టులకు అత్యవసర చికిత్స అందించి వారికి ఆపద సమయంలో దేవుడిగా మారారు.

మావోయిస్టు సమాచారంతో మరోసారి తెరపైకి:

గతంలో అరెస్ట్ అయిన కొందరు మావోయిస్టుల సమాచారంతో 2013లో రఫీక్ పేరు తొలిసారి భద్రతా దళాలకు చేరింది. మావోయిస్టులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గురించి ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు జరుపుతూనే ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత రఫీక్ భార్య రింకీ ఓసారి సీనియర్ మావోయిస్టు కమాండర్ ప్రశాంత్ బోస్‍కు చికిత్స అందించినట్లు 2018 లో పోలీసులకు సమాచారం వచ్చినా.. రఫీక్ మాత్రం 2016 లోనే దండకారణ్యాన్ని వీడి ఝార్ఖండ్‍కు మకాం మార్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆ తర్వాత కూడా ఆయన గురించి పెద్దగా ఎలాంటి వివరాలు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుసుకోలేకపోయాయని తెలుస్తోంది. ఇటీవల పొలీసుల ఎదుట లొంగిపోయిన ఓ మావోయిస్టు డాక్టర్ రఫీక్ గురించిన సమాచారాన్ని మీడియాకు వెల్లడించడంతో ఈ మిస్టరీ డాక్టర్ గురించి మరోసారి చర్చ మొదలైంది. అయితే రఫీక్ ఇప్పటికీ జార్ఖండ్ లోనే ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.

టార్చ్ లైట్ వెలుతురులోనే ఆపరేషన్:

మావోయిస్టుల పార్టీలో పని చేసిన ఏకైక శిక్షణ పొందిన వైద్యుడిగా రఫీక్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఒక సందర్భంలో భద్రతా బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్టు ఛాతీలోకి ఓ తూటా దూసుకువెళ్లి గుండెకు అతి సమీపంలో ఇరుక్కుపోయింది. ఆ తూటాను డాక్టర్ రఫీక్ టార్చ్ లైట్ వెలుతురులోనే శస్త్రచికిత్స చేసి బుల్లెట్ ను బయటకు విజయవంతంగా తొలగించాడట.

మావోయిస్టుల కోసం మెడికల్ మాన్యువల్:

రఫీక్ మావోయిస్టు కార్యకర్తలకు మరియు ఆదివాసీలకు చికిత్స చేశాడు, బుల్లెట్ గాయాలు, మలేరియా, పాముకాటు మరియు యుద్ధకాల ట్రామా కేర్‌పై వివరణాత్మక వైద్య మాన్యువల్‌లను రచించాడు మరియు స్థానిక యువతకు పారామెడిక్స్‌గా శిక్షణ ఇచ్చాడు. అలా డాక్టర్ రఫీ ఒక తరం వారికి శిక్షణ ఇచ్చారని ఇటీవల ఎన్ కౌంటర్ లో మరణించిన ల్యాబ్ టెక్నీషియన్ రవి, ఆశన్నతో పాటు లొంగిపోయిన చంపా రఫీక్ వద్ద శిక్షణ పొందిన వారని తెలుస్తోంది.

Next Story