TGSRTC: నా స్టాప్ వచ్చింది! వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా చివరి రోజు ఏం చేశారంటే?

by Ramesh Naini |   (  Updated:2025-09-29 11:52:50  IST  )

టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ప్రజా రవాణాపై అనుబంధాన్ని చాటుకున్నారు.

TGSRTC: నా స్టాప్ వచ్చింది! వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా చివరి రోజు ఏం చేశారంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ (VC.Sajjanar) ప్రజా రవాణాపై అనుబంధాన్ని చాటుకున్నారు. సామాన్య ప్రయాణికుడిలా ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ఆయన ప్రయాణించారు. (UPI Payment) యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. బస్ భవన్‌ స్టాప్‌లో ఆయన దిగిన అనంతరం ఆఫీస్‌లోకి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఎక్స్ వేదికగా సోమవారం టీజీఎస్‌ఆర్టీసీ సంస్థ షేర్ చేసింది.

మరోవైపు TGSRTC MD పదవి నుంచి వీడ్కోలు చెప్పే సందర్భంలో వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. నా స్టాప్ వచ్చింది అంటూ పేర్కొన్నారు. టీజీఎస్ ఆర్టీసీలో ఎండీగా నాలుగేళ్లు పని చేసిన నేను.. బస్సు నుంచి దిగిపోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ప్రయాణాలు ఆగుతాయి.. ప్రయాణికులు ముందుకు సాగుతారు, కానీ రహదారి ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుందని తెలిపారు. నేను ఇప్పుడు బస్సును నిలిపి, తదుపరి సవాళ్ల వైపు వేగంగా దూసుకెళ్లాల్సిన సమయం ఇది అని వెల్లడించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, కనడక్టర్లు, అధికారులు, ప్రయాణికులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా రవాణా ప్రాధాన్యతను గుర్తుచేసి, అది కేవలం సౌకర్యం కాదు, పర్యావరణానికి, ఆరోగ్యానికి ఉపయోగకరమని చెప్పారు. త్వరలోనే తన వివరమైన అనుభవాలు, నేర్చుకున్న విషయాలను పంచుకుంటానని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సజ్జనార్‌‌ హైదరాబాద్‌ సీపీగా బదిలీ అయ్యారు. అక్టోబర్ ఒకటో తేదీన ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు అధికారుల సమాచారం.

ట్వీట్ కోసం క్లిక్ చేయండి..

Next Story