వరద ముప్పునకు చెక్: మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రాలజీ సర్వే

by Naga Rani Yarlagadda |

మూసీ పునర్జీవనం కోసం రుణం ఇచ్చేందుకు మరో బ్యాంక్ ముందుకొచ్చింది. ఇందుకోసం తమకు కూడా డీపీఆర్ పంపాలని అడిగినట్లు సమాచారం.

వరద ముప్పునకు చెక్: మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రాలజీ సర్వే
X

దిశ, తెలంగాణ బ్యూరో : మూసీ పునర్జీవానికి ప్రభుత్వం చక చకా అడుగులు వేస్తోంది. ఎట్టి పరిస్థితిల్లోనూ ముందుకే వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దృఢసంకల్పంతో ఉన్నారు. పునర్జీవంపై డ్రాఫ్ట్​ డీపీఆర్​ను ఇప్పటికే ఏషియన్​ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) అధికారులకు పంపించారు. రుణం ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తూ 2025 ఆగస్టులోనే అధికారికంగా లేఖ రాశారు. 2025 జూలై ఒక సారి, 2025 నవంబర్​లో, 2026 జనవరిలోనూ ఏడీబీ అధికారుల బృందం హైదరాబాద్​లో పర్యటించి రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది.

తొలగనున్న అడ్డంకులు

మూసీ పునర్జీవం ప్రాజెక్టుకు రుణం అందించడానికి మరొక బ్యాంకు ముందుకొచ్చింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుకు గురించి తెలుసుకొని తమకు సైతం డీపీఆర్​ పంపించాలని, తాము రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఏషియన్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఇన్వెస్ట్​మెంట్ ​బ్యాంకు (ఏఐఐబీ) సమాచారం అందించినట్లుగా అధికారుల ద్వారా తెలిసింది. దీంతో వారి ద్వారా రుణం తీసుకోవడానికి వెనకాడవద్దని, రెండు బ్యాంకుల్లో ఏ బ్యాంకు తక్కువ వడ్డీతో రుణం ఇస్తే దాని ద్వారా ముందుకు వెళ్లాలని, అదే సమయంలో రెండు బ్యాంకుల మధ్య పోటీ ఉండే వడ్డీని తగ్గించాలని అడిగే ఆస్కారం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో రెండో దశ పనులకు ఏఐఐబీను వినియోగించుకోవచ్చనే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రాజెక్టుపై బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడంపై అధికారులు, ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్పప్రచారం నేపథ్యంలో ఇక్కట్లు ఎదురైనా బ్యాంకు రుణం ఇస్తే పనులు త్వరగా చేసుకుంటూ వెళ్లవచ్చని, బాధితులకు నష్టపరిహారం త్వరగా చెల్లించవచ్చని విశ్లేషిస్తున్నారు. డబ్బులు ఉంటే పనులు సాగడంతో ప్రజలు, నిర్వాసితులు కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని, ప్రభుత్వంతో చర్చలకు సుముఖంగా ఉంటారని అంచనా వేస్తున్నారు. సందిగ్ధంలో ఉన్న కొన్ని వర్గాలు కలిసి వస్తాయని చెబుతున్నారు.

ఫ్లడ్ కంట్రోల్​కు హైడ్రాలజీ సర్వే

మూసీ పునర్జీవంపై అన్ని రకాల సాంకేతిక పరమైన సర్వేలను చేపట్టి ఎక్కడా ఎలాంటి అపోహలకు, అనుమానాలకు తావులేకుండా శాస్త్రీయంగా ప్రభుత్వం సర్వే చేయిస్తుంది. దీనిలో భాగంగా రెండు నదుల పరివాహక ప్రాంతంలో హైడ్రాలజీ సర్వే చేయించారు. ఉస్మాన్​ సాగర్​లో 740 చదరపు కిలోమీటర్లు, హిమాయత్​సాగర్​లో 1362 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో 890 చదరపు కిలోమీటర్ల పరిధిలో నాలాలు ఉన్నాయని గుర్తించారు. అయితే ఈ రెండు నదులు ప్రవహించే ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు నది ప్రవాహం ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఈ విషయాన్ని హైడ్రాలజీ సర్వే ద్వారా గుర్తించారు. దీని కోసం అధికారులు నది పరివాహక ప్రాంతంలో మొత్తం సర్వే చేశారు. ఈ సర్వేను ద్వారా సమగ్ర వివరాలు రావాలంటే, ఫ్లడ్​ కంట్రోల్​ ఏ విధంగా చేయాలంటే నది పరివాహకంలోని పరిసరాలన్నింటిని సర్వే చేశారు. నది ద్వారా ఎక్కడెక్కడికి వరదలు వస్తున్నాయి, ఏ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి, వరదలు వచ్చినప్పుడు, వరదలు లేనప్పుడు, సాధారణ వర్షాలు, వరదలు అప్పుడు ఎక్కడికి వరకు ప్రవహిస్తుంది, ఏ ప్రాంతాల్లో ప్రవహిస్తుంది తదితర వివరాలన్నింటిపై హైడ్రాలజీ సర్వేను విస్తృతంగా చేపట్టారు. భవిష్యత్​లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దీనిని చేపట్టారు. నది ప్రాంతంలో వరదలను ఏ విధంగా ఫ్లడ్​ కంట్రోల్ ఎంబ్యాక్​మెంట్​ చేయడానికి సర్వేను వినియోగించుకుంటున్నారు. దీనిని ఫ్లడ్​ సిమ్యులేషన్​ మోడలింగ్​ను హెచ్​ఈసీ – హెచ్​ఎంఎస్, హెచ్​ఈసీ ఆర్​ఏఎస్​ ద్వారా చేపట్టారు. నది గర్భంలో, నది పరివాహంలో వరదలు వస్తే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎంత వరకు ఏ ఏ నిర్మాణాలు, తదితర వాటిపై నివేదిక ఇవ్వడానికి రూర్కి ఎన్​ఐటీ నిపుణుల ద్వారా అధ్యయనం చేయించారు. ఇకపై నది ప్రారంభం నుంచి మొదటి దశ పూర్తి అయ్యే వరకు ఫ్లడ్​ కంట్రోల్​ అయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నారు.

బఫర్ జోన్ 50 మీటర్లు

2016 జనవరి 5న అప్పటి మున్సిపల్​ శాఖ బఫర్​ జోన్​‌పై స్పష్టతను ఇస్తూ జీవో 7ను జారీ చేసింది. నది బౌండరి నుంచి 50 మీటర్లు బఫర్​ జోన్​ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 2012లోనూ దీనిపై ఆదేశాలు ఇచ్చారు. బఫర్​ జోన్​పై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్​ వాటర్​ కమిషన్​ జూలై 2025లో ఫ్లడ్​ ప్లెయిన్​ జోనింగ్​‌పై టెక్నికల్​ గైడ్​లైన్స్​ జారీ చేసింది. దీనికి అనుగుణంగానే నది పరివాహక ప్రాంతం నుంచి ఇరు వైపులా 50 మీటర్ల బఫర్​ జోన్​ను గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీడబ్ల్యూసీ ప్రొటెక్టెడ్​ ఏరియా, రెగ్యులేటరీ ఏరియా, వార్నింగ్​ జోన్​ను చూపించింది.

Next Story