మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు.. భూసేకరణపై రాజేంద్రనగర్ RDO కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా కిస్మత్‌పురా, బండ్లగూడ ప్రాంతాల్లో భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేశామని రాజేంద్రనగర్ ఆర్‌డీవో స్పష్టం చేశారు.

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు.. భూసేకరణపై రాజేంద్రనగర్ RDO కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలోని మూసీ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టబోయే చర్యలపై ఆర్‌డీవో వెంకట్ రెడ్డి (RDO Venkat Reddy) ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశామని, నిబంధనల ప్రకారం నిర్మాణాలను స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని కిస్మత్‌పురా, దర్గా ప్రాంతాలకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ చేసినట్లు ఆర్‌డీవో వెల్లడించారు. వీటితో పాటు బండ్లగూడ జాగీర్, ఉప్పరపల్లి పరిధిలో ఉన్న నిర్మాణాలను కూడా త్వరలోనే స్వాధీనం చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌పై స్పష్టత..

గత కొంతకాలంగా చర్చనీయాంశమైన మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ (Madhupark Ridge Apartment) అంశంపై ఆర్‌డీవో వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ అపార్ట్‌మెంట్ పూర్తిగా మూసీ బఫర్ జోన్‌లోనే ఉందని ఆయన ధృవీకరించారు. గతంలో అన్ని అనుమతులు పొంది దీనిని నిర్మించినప్పటికీ, ప్రస్తుతం ప్రాజెక్టు నిబంధనల దృష్ట్యా దీనిని స్వాధీనం చేసుకోక తప్పదని పేర్కొన్నారు. అయితే, నిబంధనల ప్రకారం బాధితులకు తగిన పరిహారం చెల్లించిన తర్వాతే అపార్ట్‌మెంట్‌ను స్వాధీనం చేసుకుంటామని వెంకట్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

50 మీటర్ల పరిధిలో ఉంటే అంతే..

మూసీ నది (Musi River) సరిహద్దుల నుంచి 50 మీటర్ల లోపల ఉన్న అన్ని నివాసాలు, ఇతర నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆర్‌డీవో వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకగా నిర్వహించేందుకు దశలవారీగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. భూసేకరణ ప్రక్రియలో భాగంగా బాధితుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లోపు ప్రభావిత ప్రాంతాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి చేస్తామని అన్నారు. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుని నిర్మాణాలను స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూసీ తీర ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆర్డీవో వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story