పట్టాలెక్కనున్న మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు.. ADB క్లియరెన్స్ రాగానే గ్లోబల్ టెండర్లు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-24 01:51:19  IST  )

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు మొదటి దశకు గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.

పట్టాలెక్కనున్న మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు.. ADB క్లియరెన్స్ రాగానే గ్లోబల్ టెండర్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై సర్కార్ సీరియస్ గా దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితిలోనూ వచ్చ నెల మొదటి వారంలో మొదటి దశకు టెండర్లు పిలవడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే రూ.4,500 కోట్ల రుణానికి ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) క్లియరెన్స్ రాగానే టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలిసింది. దీంతోపాటు మొదటి దశ డీపీఆర్‌ను పరిశీలించడానికి ఏడీబీ ప్రతినిధులు ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌కు వచ్చారు. నేటితో పరిశీలన పూర్తికానుందని అధికారులు చెబుతున్నారు. ఇదే చివరి పరిశీలనతోపాటు వారం రోజుల్లో లోన్ క్లియరెన్స్ వచ్చే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి దశ 21 కి.మీ..

హైదరాబాద్ మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ -1లో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేరకు పూర్తి చేయడానికి రూ.7,345 కోట్లకు మంత్రిమండలి పరిపాలనా అనుమతులను మంజూరు చేయడంతోపాటు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ మార్గాల్లో ఇండ్ల నష్టం తగ్గించే విధంగా ప్రణాళికల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి భూసేకరణ, హిమాయత్ సాగర్ బండ్ బలోపేతం, ఎకో ప్రాజెక్టు పనులను చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు విస్తరణ, రక్షణశాఖకు సంబంధించిన భూములను సేకరించే కార్యక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. దీంతోపాటు ఏడీబీ లోన్ కోసం ప్రత్యేకంగా ‘ఎస్క్రో అకౌంట్’ క్రియేట్ చేయడానికి ఎంఆర్డీసీఎల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు అధికారులతో చర్చించారు. మొదటి దశ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియకు సంబంధించిన పేపర్ వర్క్ పూర్తిచేసినట్టు సమాచారం. మొదటి దశ టెండర్ పనులు, రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్ పనులను ఏకకాలంలో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

లోన్ క్లియరెన్సే తరువాయి..

మూసీ మొదటి దశ ప్రాజెక్టు డీపీఆర్‌ను మరోసారి పరిశీలించడానికి ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) అధికారులు ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌కు వచ్చారు. నేటితో ఈ బృందం పర్యటన పూర్తికానుంది. మూసీ ప్రాజెక్టు పూర్వపరాలను పరిశీలించడానికి, అధికారులతో చర్చించడానికి ఏడీబీ అధికారులు ఆరు సార్లు విజిట్ చేశారు. ఈ నెలలో నాలుగు రోజులపాటు చేసిన పరిశీలనే చివరిదికానుందని తెలుస్తోంది. ఈ పరిశీలన తర్వాత లోన్ క్లియరెన్స్ ఇవ్వడమే తరువాయిగా మిగిలింది.

భాగస్వామ్య శాఖలతో..

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు విషయంలో ఎంఆర్డీసీఎల్ అధికారులు, మెయిన్ హర్డ్ ఏజెన్సీ రూపొందించిన డీపీఆర్‌ను పరిశీలించడంతోపాటు మూసీ ప్రాజెక్టుతో అనుసంధానం ఉన్న భాగస్వామ్య శాఖలతోనూ ఏడీబీ అధికారులు చర్చించారు. గురువారం అన్ని భాగస్వామ్య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. హెచ్ండీఏ, జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ, జలమండలి, పీసీబీ, నీటిపారుదల శాఖల అధికారులతో ఏడీబీ ప్రతినిధులు చర్చించారు. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు భాగస్వామ్య శాఖలు అంగీకరించారా? లేదా? ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఉంటే ఇప్పుడు చెప్పాలని ఏడీబీ ప్రతినిధులు కోరినట్టు తెలిసింది. అన్ని శాఖలు అంగీకారం తెలిపినట్టు సమాచారం. మొదటి దశ డీపీఆర్‌కు అన్ని శాఖల అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏడీబీ ప్రతినిధులు సైతం సంతృప్తి వ్యక్తం చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.

క్లియరెన్స్ రాగానే టెండర్లు..

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్, భాగస్వామ్య శాఖల అధికారుల సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఏడీబీ ప్రతినిధులు ఈనెలాఖరు వరకు రూ.4,500కోట్ల రుణానికి క్లియరెన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఏడీబీ నుంచి క్లియరెన్స్ రాగానే వచ్చేనెల మొదటి వారంలో ప్రాజెక్టుకు గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశమున్నట్టు తెలిసింది. దీంతోపాటు నాగోల్ నుంచి గౌరెళ్లి వరకు రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్ పై అధికారులు దృష్టి సారించనున్నారు.

Next Story