మూసీ ప్రాజెక్టుపై స్పీడ్ పెంచిన సర్కార్

by Naga Rani Yarlagadda |

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ స్పీడప్ చేసింది. దీనిపై ఈనెల 13న జరిగే మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

మూసీ ప్రాజెక్టుపై స్పీడ్ పెంచిన సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగం పెంచింది. ఎన్ని ఒత్తిళ్లు, అడ్డంకులు ఎదురైనా ప్రజామోద పరిష్కారాలను కనుగొంటూ ముందుకెళ్లాలని సంకల్పించింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులలో వ్యక్తమవుతున్న సందేహాలు, అనుమానాలు, అభ్యంతరాలను అన్నింటిని వినాలని నిర్ణయించింది. మూసీ పునరుజ్జీవనంపై ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకోకుండా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం, అమలు చేయనున్న ప్రతిపాదనలు, నివేదికలను భాగస్వామ్య పక్షాల ముందు ఉంచనుంది. వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వనుంది. వారి అభ్యంతరాలకు పరిష్కారాలు చూపనుంది. దీని కోసం ఈ నెల 13వ తేదీన సాయంత్రం తాజ్​ కృష్ణా హోటల్​లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ‘పార్టనర్​ ఆఫ్​ డెవలప్​మెంట్​’ నినాదంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్​ రెడ్డి హాజరుకానున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు. వీరితో పాటుగా పారిశ్రామికవేత్తలు, పర్యావరణ వేత్తలు, మీడియా ప్రతినిధులను, ఇతర ప్రముఖులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు భాగస్వామ్యం కానున్నారు.

మూసీ పునరుజ్జీవనంలో పార్టనర్ ఆఫ్​ డెవలప్మెంట్ నినాదంలో భాగస్వామ్యం చేయడం ద్వారా వారికున్న సందేహాలు తీరితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రతిపక్షాలు, ప్రజలు, నిర్వాసితులు, మూసీ వెంట ఉన్న ప్రజల అపోహలు, వారి సమస్యకు పరిష్కారం చూపనున్నారు. పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా ప్రభుత్వం విధానాన్ని మొత్తం వివరిస్తారు. ప్రభుత్వ ఆలోచన, ప్రతిపాదనలు వివరిస్తారు. దీని కోసం నిధుల సమీకరణను వెల్లడిస్తారు. రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన సంస్థలు, రుణం మొత్తం వివరిస్తారు. గాంధీ సరోవర్​ ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడిస్తారు. అనంతరం అక్కడికి వచ్చిన పర్యావరణ వేత్తలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, పారిశ్రామివేత్తల సందేహాలను తీరుస్తారు. వారి అభ్యంతరాలను స్వీకరిస్తారు. సలహాలు తీసుకుంటారు. వీటన్నింటిని క్రోడీకరించి ముందుకు వెళ్లనున్నారు.

అతి పెద్ద మహాత్మా గాంధీ విగ్రహం

మూసీని ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రిగా రేవంత్​ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పట్టుదలతో ఉన్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన ముందుకే సాగుతున్నారు. మూసీ పునరుజ్జీవనంపై ఇప్పటికే డిటైల్డ్​ ప్రాజెక్టు రిపోర్ట్​(డీపీఆర్​)ను తయారు చేశారు. దీని కోసం ఏషియన్​ డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) నుంచి రూ.4 వేల కోట్లు రుణం తీసుకోనున్నారు. ఏడీబీ కూడా అంగీకరించింది. నిధులు సిద్ధంగా ఉన్నాయి. మొదటి దశలో 21 కిలోమీటర్లు చేపట్టనున్నారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్​వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్​ వరకు చేపడుతారు.

బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే అతి పెద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే మోడల్​ను ఖరారు చేశారు. దీని కోసం రక్షణ శాఖ భూములు అవసరం అవుతాయని గుర్తించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ను కలిశారు. ఈ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. 50 ఎకరాలు రక్షణ శాఖ భూములు కావాల్సి ఉండగా 40 ఎకరాలు ఇవ్వడానికి ఓకే చెప్పారు. మరో 50 ఎకరాలు ప్రైవేటు ల్యాండ్​సేకరణ, భవనాలను సేకరించడానికి నోటిఫికేషన్​విడుదల చేశారు. దీనితో పాటుగా హిమాయత్​ సాగర్ వద్ద​ ఇండియా గేట్ తరహాలో గేట్ వేను ఏర్పాటు చేయనున్నారు. మూసీలోకి మురుగు రాకుండా ఎస్టీపీల ఏర్పాటు, గండిపేట, హిమాయత్ సాగర్​లోకి గోదావరి జలాలను తరలించే పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. దీంతో మూసీ అంతటా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. పర్యాటక ప్రాంతంగా, నైట్​ మార్కెట్​, షాపింగ్​ కాంప్లెక్స్​ ఏర్పాటు చేయనున్నారు. నగర ప్రజలు సేద తీరిందేకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

Next Story