కేటీఆర్ ఆరోపణలు అవాస్తవం: రెండేళ్ల కసరత్తు తర్వాతే మూసీ డీపీఆర్ - అసెంబ్లీలో శ్రీధర్ బాబు క్లారిటీ

by Gantepaka Srikanth |

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

కేటీఆర్ ఆరోపణలు అవాస్తవం: రెండేళ్ల కసరత్తు తర్వాతే మూసీ డీపీఆర్ - అసెంబ్లీలో శ్రీధర్ బాబు క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రాజెక్టు పురోగతిని వివరించారు. మూసీ తొలి దశ డీపీఆర్ (DPR) సిద్ధమైందని, దీని అంచనా వ్యయం రూ. 6,500 నుంచి రూ. 7,000 కోట్ల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. మూసీ పునర్నిర్మాణంలో భాగంగా ప్రాథమికంగా 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన తుది ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. "బఫర్ జోన్‌లో ఉన్న వారికి ప్రభుత్వం తరపున టీడీఆర్ (TDR) ఇస్తాం. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే బాధితులకు నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తాం" అని మంత్రి స్పష్టం చేశారు.

బఫర్ జోన్‌పై క్లారిటీ..

బఫర్ జోన్ విషయంలో గత ప్రభుత్వ నిర్ణయాలనే తాము అనుసరిస్తున్నామని శ్రీధర్ బాబు గుర్తుచేశారు. "మేము కొత్తగా బఫర్ జోన్‌ను నిర్ణయించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే ప్రస్తుతం బఫర్ జోన్ కొనసాగుతోంది" అని ఆయన వివరించారు. ఈ సందర్భంగా డీపీఆర్ తయారీపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. "కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు డీపీఆర్ రెండు నెలల్లో పూర్తి కాలేదు. 2024 డిసెంబర్‌లో మెయిన్ హార్ట్ (Main Heart) సంస్థకు బాధ్యతలు అప్పగించగా, 2026 ఫిబ్రవరిలో ఆ సంస్థ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అంటే శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నివేదిక సిద్ధమైంది" అని ఆయన స్పష్టం చేశారు.

ప్రాజెక్టుల నిలిపివేతపై స్పందన..

త్వరలో ADB బోర్డు సమావేశంలో మూసీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, అనుమతులు లభించే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ఆపేసిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. "మేము ఏ ప్రాజెక్టును నిలిపివేయలేదు. ఎస్టీపీలకు (STP) సంబంధించి గత ప్రభుత్వంలో కేవలం 30 శాతం పనులే జరిగాయి. మిగిలిన 70 శాతం పనులను మా ప్రభుత్వమే పూర్తి చేసింది" అని గణాంకాలతో సహా వివరించారు.

Next Story