మూసీ ప్రక్షాళన జరగాల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-20 08:22:30  IST  )

హైదరాబాద్ (Hyderabad) మహానగరాభివృద్ధిలో చాలా మంది ప్రముఖుల పాత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మూసీ ప్రక్షాళన జరగాల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరాభివృద్ధిలో చాలా మంది ప్రముఖుల పాత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన గచ్చిబౌలిలోని ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ఇక్కడి నుంచే పని చేయడం మనందరికీ గర్వకారణమని అన్నారు. చంద్రబాబు, వైఎస్ఆర్‌‌లు కూడా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఇక దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి వెనుకు స్వర్గీయ రాజీవ్ గాంధీ పాత్ర కూడా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైటెక్స్ సిటీకి పునాది రాయి పడిందని, ఆ తరువాత దాని నిర్మాణాన్ని చంద్రబాబు కొనసాగించారని గుర్తు చేశారు.

మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ కొందరికి నచ్చడం లేదు..

నేడు రాష్ట్రాలకు రూ.లక్షల కోట్ల ఆదాయం రావడంలో ఐటీదే కీలక పాత్ర అని కొనియాడారు. అటు అమెరికాలో కూడా సిలికాన్ వ్యాలీని తెలుగు వాళ్లు శాసిస్తున్నారని తెలిపారు. తెలుగు వాళ్లు లేకపోతే అమెరికా ఐటీ కంపెనీలు నడిచే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో హైదరాబాద్‌కు పోటీగా నిలబెట్టాలని తెలిపారు. కానీ, మూసీ ప్రక్షాళన.. ఫ్యూచర్ సిటీ కొందరికి నచ్చడం లేదని కామెంట్ చేశారు. ఆనాడు కూడా హైటెక్స్ సిటీని కొందరు అవహేళన చేశారని.. ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు, ఊరు చివర ఎయిర్‌పోర్టా అంటూ కామెంట్లు చేశారని గుర్తు చేశారు.

మూసీ మురికిలో బతకాలని ఎవరు కోరుకుంటారు..

నాటి ప్రభుత్వాలు అభివృద్ధి చేయబట్టే.. నేడు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందని అన్నారు. గతంలో హైదరాబాద్ వేదికగా ఎన్నో అందర్జాతీయ క్రీడలు నిర్వహించామని.. తెలంగాణ రైజింగ్ నినాదంతో హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఓల్డ్ సిటీని.. గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసి ప్రక్షాళన జరగాల్సిందేనని నినదించారు. మూసీ మురికిలో బతకాలని ఎవరు కోరుకుంటారని.. రాజీవ్ స్వగృహ ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేస్తామని అన్నారు. ప్రపంచ స్థాయి నగరంలో ఆ స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు లేవని.. సర్కార్ కార్యాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నేటికీ ప్రభుత్వానికి ఎంతో ఆదాయం తెచ్చిపెట్టే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కూడా సరిగా లేకపోవడం శోచనీయమని తెలిపారు. 8 నెలల వ్యవధిలో గచ్చిబౌలిలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నగర అభివృద్ధిని అడ్డుకునే వారు మనకు శత్రువులేనని.. అలాంటి దొంగల పని పట్టాల్సింది ప్రజలేనని రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story