మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యేకు షాక్.. డిపాజిట్ గల్లంతు చేసేలా సొంత పార్టీ నేతల స్కెచ్!

by Disha Web Desk 4 |
మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యేకు షాక్.. డిపాజిట్ గల్లంతు చేసేలా సొంత పార్టీ నేతల స్కెచ్!
X

దిశ, చౌటుప్పల్: మునుగోడు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ అసమ్మతివాదులు మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అధిష్టానం చొరవ తీసుకొని అసంతృప్తులందరితో మాట్లాడి కలిసి పనిచేసేలా చర్యలు చేపట్టడంతో కొద్దిపాటి మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. అయితే ఉప ఎన్నికలలో గెలిచిన అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన నాయకులు అందరిపై కక్ష సాధింపు చర్యలకు దిగి పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా దూరం పెడుతూ వస్తున్నారంటూ అసమ్మతివాదులు ఆరోపిస్తున్నారు.

దీంతో పార్టీ అధిష్టానానికి స్థానిక బీఆర్ఎస్ అసంతృప్త నేతలు మునుగోడు టికెట్‌ను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తప్ప ఎవరికీ కేటాయించిన కలసి పనిచేస్తామంటూ విన్నవించుకుంటూ వచ్చారు. కానీ ఇవన్నీ లెక్కచేయకుండా పార్టీ అధిష్టానం తిరిగి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ఫైనల్ చేసింది. దీంతో నియోజకవర్గంలో కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. వీరందరినీ పిలిచి సమన్వయ పరుస్తూ గెలుపు కోసం కృషి చేయాల్సిన పార్టీ అభ్యర్థి ఏనాడూ తమకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో సమీక్ష సమావేశాలు నిర్వహించారని అసమ్మతివాదులు తెలుపుతున్నారు.

అయినా ఓపికగా పార్టీ కోసం నిరీక్షిస్తుంటే పైగా క్రమశిక్షణ చర్యల పేరుతో స్థానిక ప్రజాప్రతినిధులపై వేటు వేయిస్తూ వస్తుండడంతో వాళ్ళని ఆగ్రహానికి గురిచేసిందని చెప్పాలి. దీంతో ఇప్పటివరకు ఓపికగా నిరీక్షించిన స్థానిక ప్రజాప్రతినిధులు అంతా కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓటమికి వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

టార్గెట్ మైనస్ 30 వేల ఓట్లు..

మునుగోడు నియోజకవర్గంలోని అసంతృప్త వాదులంతా ఇప్పటికే వాట్సాప్‌లో టార్గెట్ మైనస్ 30000 గ్రూపును ఏర్పాటుచేసుకొని నిత్యం అభ్యర్థి ఓటమిపై వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. 2022లో మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీల పొత్తుతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 97006 ఓట్లు వచ్చాయి. ఇందులో వామపక్ష పార్టీల ఓట్లు సుమారు 20 వేల వరకు ఉన్నట్లు వారు అంచనా వేశారు. మిగిలిన 77 వేల ఓట్లలో 30 వేల ఓట్లను తగ్గించే దిశగా అసంతృప్త నేతలంతా పనిచేస్తే ప్రస్తుతం పోటీల్లో ఉన్న అభ్యర్థులతో అధికార పార్టీ అభ్యర్థికి డిపాజిట్ దక్కకుండా చేయవచ్చు అని అంచనాలు వేస్తున్నట్లు తెలుస్తుంది.

అసంతృప్త నేతలు వీరేనా!

మునుగోడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి స్థానిక మెజార్టీ నేతలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు కూడా వీరంతా డుమ్మా కొట్టారు.

డుమ్మా కొట్టిన నేతలలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, కర్నాటి విద్యాసాగర్, నాంపల్లి జడ్పీటీసీ ఎల్గూటి వెంకటేశ్వర రెడ్డి, నాంపల్లి ఎంపీపీ పానుగంటి రజనీ వెంకన్న గౌడ్, నారాయణపురం ఎంపీపీ ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణా లింగస్వామి గౌడ్, చెరుకు కిష్టయ్య, ఎంపీటీసీ సభ్యులు,మహ్మద్ రఫీ కోఆప్షన్ సభ్యులు, వనం నిర్మల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేనేపల్లి వెంకటేశ్వరరావు, సర్పంచ్ చలమల్ల వెంకట్రెడ్డి, మాజీ జడ్పీటీసీ బొల్ల శివశంకర్, ఎంపీటీసీ రాజు నాయక్, నారాయణపురం సర్పంచ్ శ్రీహరి, అందోల్ మైసమ్మ టెంపుల్ చైర్మన్ సిద్దిపేట శేఖర్ రెడ్డి మాజీ సర్పంచ్ బొంగు జంగయ్య గౌడ్, పిల్లలమర్రి శ్రీనివాస్‌లతో పాటు మరో 20 మంది ఎంపీటీసీలు, 40 మందికి పైగా సర్పంచ్లు ఉన్నారు.

వీరంతా తమకు అభ్యర్థి నుండి సమాచారం లేకపోవడంతోనే దూరంగా ఉన్నట్లు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇప్పటికే నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవి పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికి ఆమె మునుగోడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అసమ్మతి వాదులంతా మూకుమ్మడి రాజీనామా చేసి బహిరంగంగానే పార్టీ అభ్యర్థి ఓటమికి కృషి చేయాలని చర్చించుకున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed