పట్టణాల్లో వేడిక్కిన మున్సిపల్ రాజకీయం

by Muthe.Rajitha |

రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల తరువాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తప్పవనే సంకేతాలతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

పట్టణాల్లో వేడిక్కిన మున్సిపల్ రాజకీయం
X

దిశ, గోదావరిఖని : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల తరువాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తప్పవనే సంకేతాలతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన రాకముందే కార్పొరేటర్ కుర్చీపై కన్నేసిన అభ్యర్థులు రంగంలోకి దిగిపోయారు. వాడవాడలా తిరుగుతూ, గల్లీ గల్లీ పట్టుకొని నేను ఎన్నికల్లో ఉంటున్నా అని చెప్పుకుంటూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఓటర్లే లక్ష్యంగా ఎత్తుగడలు

ఇప్పటికే పట్టణాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాల ఎత్తుగడలు మొదలయ్యాయి. చిన్నచిన్న హామీలతో మొదలైన ఈ ప్రయత్నాలు, ఇప్పుడు తాగించడం, హామీలు ఇవ్వడం వరకు వెళ్లాయి. కొన్ని చోట్ల అయితే నాయకులను, దగ్గరి వారి గోవా, థాయిలాండ్ ట్రిప్పులు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశీ సరుకుతో విందులను ఏర్పాటు చేస్తున్నారు. కొంతమందికి ఇప్పటినుంచే చిన్న చిన్న గిఫ్ట్స్ పంచటం తెర వెనుక జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హమీలు ఇస్తున్న ఆశావాహులు

రోడ్లు వేస్తా, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తా, నీటి కష్టాలు తీర్చేస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా.. ఇలాంటి హామీలు ప్రతి వాడలో కొత్తగా వినిపిస్తున్నాయి. కానీ గతంలో గెలిచిన కార్పొరేటర్లు ఎక్కడ? వాగ్దానాల అమలు ఎంత జరిగిందన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు లేవు.

ప్రభుత్వం నిశ్శబ్దం.. అభ్యర్థుల హడావుడి

ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ స్థాయిలో హడావుడి సాగుతుండటంపై సామాన్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిషబ్దంగా ఉండగా అభ్యర్థులు మాత్రం ఇప్పుడే గెలిచినట్టు ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.

ఓటు విలువ మరిచిపోతున్న ఓటర్లు?

తాగుడుకు, వాగ్దానాలకు, డబ్బులకు, తాయిలాలకు లొంగి ఓటు వేస్తే తరువాత ఐదేళ్లు ప్రశ్నించే హక్కు కోల్పోతామన్న విషయం ప్రజలు గుర్తించాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ ఇచ్చే తాత్కాలిక ప్రయోజనాలకు లొంగకుండా, నిజమైన అభివృద్ధే ప్రమాణం కావాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

పార్టీల మధ్య పెరుగుతున్న పోటీ

జిల్లాలో, నియోజకవర్గాలలో, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మా పార్టీ అభ్యర్థులే అధికంగా గెలవాలని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పార్టీల మధ్య పోటీ పెరగడంతో దానికి తగ్గట్లు వార్డులలో నిలబడే అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నం కోసం నానా యాగ చాట్లు పడుతున్నారు. పెద్ద నాయకుల మెప్పుకోసం రోజుకు వేల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఫ్లెక్సీలు వేస్తున్నారు. రోజు కార్లలో తిరుగుతూ ఎక్స్​పోజ్​ అవుతున్నారు. దీంతో రాజకీయ నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. వీధివీధిన ప్రచారం, ఇంటింటా పలకరింపు, సమస్యలపై హామీల వర్షం మొదలైంది.

సోషల్ మీడియాలో ప్రచారం

ఒకవైపు అధికార పార్టీ తన పనితీరును చెప్పుకుంటే, మరోవైపు ప్రతిపక్షం పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియాలో అనేక ప్రచారాలను మొదలుపెట్టారు. ఉదయం లేవగానే ఫేస్​బుక్​, వాట్సాప్ లలో ఓటర్ల, రాజకీయ నాయకులను ఆకట్టుకోవడానికి అన్ని గ్రూపులలో వారి పార్టీ గ్రూపులలో పోస్టులు చేస్తున్నారు. నేను పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాను. నేను ఇంతకుముందు ప్రజలకు ఇలా సేవ చేసాను. రాబోయే రోజుల్లో నేను యువతకు అది చేస్తా.. ఇది చేస్తా అని ప్రచారం చేసుకుంటున్నారు. పట్టణ ప్రజలు, ఓటర్లు తెలివైన వారికి, నీతిమంతులకు, విద్యావంతులకు పట్టం కడతారో లేక మోసపూరిత ప్రకటనలకు, నాయకుల ఇచ్చే ఆమ్యామ్యాలకు ఆశపడి మోసపోతారు వేచి చూద్దాం.

Next Story