రికార్డుస్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు

by Ajay Maddhiboyina |

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ స్కీమ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పురపాలక శాఖ కమిషనర్ టీకే.శ్రీదేవి తెలిపారు.

రికార్డుస్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ స్కీమ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పురపాలక శాఖ కమిషనర్ టీకే.శ్రీదేవి తెలిపారు. ఆస్తిపన్నును ఏప్రిల్ మాసంలో లో చెల్లించిన వారికి మొత్తంపై 5శాతం రాయితీని కల్పించిందని అన్నారు. ప్రజలు విశేషంగా స్పందించి, స్వచ్చ్చందంగా ఆస్తి పన్నులు చెల్లించినట్టు చెప్పారు. రాష్ట్రంలో అన్ని పురపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో(జీహెచ్ఎంసీ కాకుండా) రికార్డు స్థాయిలో మునుపెన్నడూ లేనివిధంగా ఆస్తిపన్ను వసూలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్తిపన్ను డిమాండ్ రూ.2264.84 కోట్లుగా ఉందని తెలిపారు. ఎర్లీబర్డ్ పథకంలో రూ 400.36కోట్లు (17.68శాతం) వసూలైందని తెలిపారు.

గతేడాది రూ.317కోట్లు (14.08శాతం) ఉందని, గతేడాదితో పోలిస్తే ఈ సారి రూ.82.88 కోట్లు ఎక్కువ వసూలైందన్నారు. ఎర్లీబర్డ్ పథకం ద్వారా ఆస్తి పన్ను వసూళ్లు ప్రక్రియ మెరుగుపర్చడానికి పలుపర్యాయాలు దశలవారీగా మున్సిపల్ కమిషనర్లందరితో వీడియో కాన్ఫరెన్స్ లు, టెలికాన్ఫరెన్స్ లు, సమీక్షలు చేసినట్టు చెప్పారు. సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలో ప్రజలను చైతన్యం చేయడానికి నిరంతరం ప్రచార కార్యక్రమాలు నిర్వహించారని వెల్లడించారు. ఎర్లీబర్డ్ స్కీం గురించి గత నెల 16న ఆల్ఇండియా రేడియో ద్వారా అవగాహన కల్పించినట్టు చెప్పారు. జమ్మికుంట 54.78శాతం, హుజురాబాద్ 51.85శాతం వసూళ్లు చేసినట్టు తెలిపారు.

బొల్లారం, రామగుండంకార్పొరేషన్, గుమ్మడిదల, పీర్జాదిగూడ కార్పొరేషన్, తూముకుంట, మద్దూర్, గుండ్లపోచంపల్లి, నిజాంపేట్ కార్పొరేషన్, చౌటుప్పల్, నాగారం, నార్సింగి, సిద్దిపేట, నారాయణఖేడ్, కోదాడ మున్సిపాలిటీల్లో 30శాతం కంటే ఎక్కువ వసూలు చేశారని, కొత్తగా ఏర్పడిన గుమ్మడిదల 42శాతం, మద్దూర్ 34.2, గడ్డపోతారాం 26.24, మొయినాబాద్ 21.41, చేవెళ్ల 21.26 శాతం వసూళ్లు చేసినట్టు వివరించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, మెదక్, వర్ధన్నపేట, చేర్యాల్, వైరా, పోచంపల్లి, భైన్సా, ఇంబ్రహీంపట్నం, జలపల్లి, సదాశివపేట, వనపర్తి, ఆదిలాబాద్, దేవరకొండ, బోధన్, అశ్వారావుపేట, స్టేషన్ ఘనపూర్, ఎదుల్లపురం, భూపాలపల్లి, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లో 10శాతం ఆస్తిపన్నులు వసూలైనట్టు చెప్పారు.

Next Story