MSME రంగానికి గ్రహణం.. వేల యూనిట్ల మూసివేత.. లక్షల్లో నిరుద్యోగం!

by Naga Rani Yarlagadda |

తెలంగాణలో MSME మూత పడటంతో లక్షలాదిమంది నిరుద్యోగులవుతున్నారు.

MSME రంగానికి గ్రహణం.. వేల యూనిట్ల మూసివేత.. లక్షల్లో నిరుద్యోగం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) గత కొన్నేళ్లుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడినప్పటికీ, ఈ రంగం పూర్తిగా కోలుకోలేదన్నది తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ, మన రాష్ట్రంలోనూ దీని ప్రభావం మరింత సున్నితంగా కనిపిస్తున్నది. 2020 నుంచి 2026 వరకు దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఎంఎస్ఎంఈలు మూతపడటం అంటే సాధారణ విషయం కాదు. ఇది కేవలం పరిశ్రమల మూసివేతల గణాంకం మాత్రమే కాదు.. వేలాది కుటుంబాల జీవనోపాధిపై పడిన భారం కూడా. ముఖ్యంగా 2024 తర్వాత మూసివేతలు వేగంగా పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఒక్క 2025-26లోనే దాదాపు 58 వేల యూనిట్లు మూతపడటం, మూడు లక్షలకుపైగా ఉద్యోగాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను చూపుతున్నది.

రాష్ట్రంలోనూ మూసివేత..

తెలంగాణలోనూ ఎంఎస్ఎంఈలు చాలావరకు మూతపడుతూ వస్తున్నాయి. చిన్న పరిశ్రమలు, వర్క్‌షాపులు, టెక్స్‌టైల్ యూనిట్లు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ పరిసరాలు, సిరిసిల్ల, వరంగల్ వంటి ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా యూనిట్లు ఉపాధికి కీలక కేంద్రాలు. ఈ యూనిట్లలో ఏ చిన్న అంతరాయం వచ్చినా అది నేరుగా స్థానిక ఉపాధిపై ప్రభావం చూపుతుంది. ఇదే సమయంలో టెక్స్‌టైల్ రంగానికి ప్రాణాధారంగా ఉన్న స్పిన్నింగ్ మిల్స్ పరిస్థితి కూడా స్థిరంగా లేదు. తెలంగాణలో ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే.. మిల్స్ సంఖ్యలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల్లో మిల్స్ సంఖ్య తగ్గిపోవడం, తర్వాత మళ్లీ పెరిగినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. పనిచేస్తున్న మిల్స్ సంఖ్య స్థిరంగా లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. కరోనా సమయంలో డిమాండ్ పడిపోవడం మొదటి దెబ్బ అయితే, తర్వాత ముడిసరుకు ధరల పెరుగుదల, ముఖ్యంగా పత్తి ధరల అస్థిరత టెక్స్‌టైల్ రంగాన్ని బలంగా దెబ్బతీశాయి. చిన్న యూనిట్లు సాంకేతికంగా వెనుకబడి ఉండటం, బ్యాంకు రుణ భారం, అంతర్జాతీయ మార్కెట్ పోటీ ఇవన్నీ కలిసి ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాయి.

కేంద్ర గణాంకాల ప్రకారం తెలంగాణలో..

2019-20 : 103 మిల్స్ (59 పనిచేస్తున్నవి)

2020-21 : 119 మిల్స్ (103 పనిచేస్తున్నవి)

2021-22 : 77 మిల్స్ (65 పనిచేస్తున్నవి)

2022-23 : 118 మిల్స్ (101 పనిచేస్తున్నవి)

2023-24 : 122 మిల్స్ (100 పనిచేస్తున్నవి)

Next Story