ఐదు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు..! స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఐదు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచిస్తున్నది.

ఐదు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు..! స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఐదు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచిస్తున్నది. వర్షాకాలం, శాంతిభద్రతలు, గిరిజన ప్రాంతాలకు పోలింగ్​సిబ్బంది వెళ్లడం, పోలింగ్​ మెటీరియల్ ​తరలించడం తదితరాలను దృష్టిలో ఉంచుకుని సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. 2019‌లో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. అప్పుడు వేసవి కారణంగా మూడు విడతల్లో నిర్వహించగలిగారని, కానీ ఇప్పుడు వర్షకాలం అయినందున, ఎదురయ్యే ఇబ్బందులు, అవాంతరాలను ముందుగానే అంచనా వేసి ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారం ఇవ్వగానే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. పోలింగ్​స్టేషన్లు, ఓటరు జాబితాను ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారులు సిద్ధం చేశారు. ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం ద్వారా పోలింగ్​సిబ్బంది, పోలీసులను తరలించడం సులువు అవుతుందని, పర్యవేక్షణలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. వర్షాకాలం అయినందున వర్షం కురిస్తే రవాణాకు, ఓటింగ్‌కు ఇబ్బందిలేకుండా ఉండాలనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

రెండు నుంచి మూడు రోజుల గ్యాప్

ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైన నాటి నుంచి పోలింగ్ వరకు మధ్య ప్రక్రియను పూర్తి చేసేందుకు 15 రోజులు ప్రక్రియకు సమయం అవసరం. 2019 ఎన్నికల సమయంలో ఒక్కో దశకు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చారు. కానీ ఈ సారి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారం ఇచ్చాక.. పోలీసు అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు ఎన్నికలకు ఒకే రోజు పోలింగ్​జరగనుంది. అనంతరం సర్పంచ్​ఎన్నికలు నిర్వహిచనున్నారు.

Next Story