ఎవరు సరైన అభ్యర్థో ఎంపీలే నిర్ణయించాలి.. ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి

by Kema Shiva Kumar |

ఉప రాష్ట్రపతి (Vice President) ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ (NDA) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఎవరు సరైన అభ్యర్థో ఎంపీలే నిర్ణయించాలి.. ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి (Vice President) ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ (NDA) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇండియా కూటమి తమ అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (B Sudarshan Reddy) పేరును ప్రకటించింది. ఈ పరిణామంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు రేపు ఇండియా కూటమి అభ్యర్థిగా బి.సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప రాష్ట్రపతి పదవి రాజ్యాంగబద్ధమైనదని కామెంట్ చేశారు. ఆ పదవికి అర్హుడినని అనుకుంటే తనకు ఓటు వేయాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి పదవిని, దేశాన్ని వేరుగా చేసి చూడొద్దని అన్నారు.

తాను నిర్మొహమాటంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చానని.. ఇందులో ఎలాంటి దాపరికాలు లేవన్నారు. ఉప రాష్ట్రపతి పదవికి ఎవరు సరైన అభ్యర్థో ఎంపీలే నిర్ణయించాలని అన్నారు. ప్రజాప్రతినిధులంతా సరైన నిర్ణయమే తీసుకుంటారని తాను భావిస్తున్నానని తెలిపారు. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతోన్న పోరు కానే కాదని అన్నారు. తనకు ఎలాంటి భావజాలం లేదని.. ఏ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్న దాఖలాలు లేవని స్పష్టం చేశారు. సమానత్వం, స్వేచ్ఛపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు. భారత రాజకీయ వ్యవస్థలో కొంత మార్పు జరగాల్సి అవసరం ఉందన్నారు. రాజ్యసభను నిష్పక్షపాతంగా నడపడం అవసరమని తెలిపారు. తనను ఉప రాష్ట్రపతిగా ఎన్నుకుంటే రాజ్యంగ పరిరక్షణ కృషి చేస్తానని అన్నారు. ఆనాటి ఎన్టీఆర్ ఎపిసోడ్‌లో తీర్పునిచ్చిన వాళ్లలో తాను ఒకడినని గుర్తు చేశారు. ఉప రాష్ట్రపతిగా గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని తాను అనకోవడం లేదని.. ఎన్డీఏ (NDA) సభ్యులు కూడా తనకు ఓటు వేస్తారని భావిస్తున్నానని సుదర్శన్ రెడ్డి అన్నారు.

Next Story