- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కుమ్మక్కు : ఎంపీ రఘనందన్ రావు
కాళేశ్వరం కేసులో కాంగ్రెస్ చేస్తున్న హడావుడి దొంగనే దొంగ అని అరిచినట్లుగా ఉందని ఎంపీ రఘనందన్‌రావు విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం కేసులో కాంగ్రెస్ చేస్తున్న హడావుడి దొంగనే దొంగ అని అరిచినట్లుగా ఉందని ఎంపీ రఘనందన్‌రావు విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకల కేసులో అధికారంలోకి రాగానే రెండు నెలలలోపే విచారణ చేసి, కాజేసిన లక్ష కోట్ల సొమ్మును కక్కిస్తామని ప్రగల్భాలు పలికిందని ఎద్దేవా చేశారు. బుధవారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఎప్పుడూ ఏ వ్యవస్థల్నీ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకోలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, సీబీఐని తన కక్షపూరిత రాజకీయాల కోసం వాడుకుందన్నారు. అప్పట్లోనే ప్రతిపక్ష నేతలంతా సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్” అని పిలిచారని, అది రేవంత్ రెడ్డి మర్చిపోయినట్టు కనిపిస్తోందన్నారు. తమ పార్టీ కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉంటుంది. తప్పు చేసిన వారి పట్ల చట్టం తన పని తాను చేసుకు వెళ్తుందని తాము నమ్ముతామని వెల్లడించారు. కాంగ్రెస్ సీబీఐ, సీబీసీఐడీ, ఇతర ఏజెన్సీలను దుర్వినియోగం చేసే పని బీజేపీ ఎప్పుడూ చేయదన్నారు. తమపార్టీ న్యాయవ్యవస్థకు సంపూర్ణ గౌరవం ఇస్తుంది. ఆ సంస్థలు స్వతంత్రంగా పనిచేసేలా పూర్తి స్వేచ్ఛను కల్పిస్తుంది. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి బోధపడటం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ జీవో 104 ఇచ్చినప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా మూడు బ్యారేజీలపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా, ముఖ్యమంత్రి పీసీ ఘోష్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. నివేదిక వచ్చిన సమయానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే ఉంది. ఆ నివేదిక ఆధారంగా, కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 తర్వాత మూడు నెలల్లోనే, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వంటి వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారో చెప్పాలన్నారు. రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. టైమ్ పాస్ చేస్తూ, కమిషన్ గడువును మూడు నెలలు, ఆరు నెలలు పెంచుతూ కాలయాపన చేస్తూ వచ్చారని మండిపడ్డారు.కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు విషయంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వరం మారింది ఎందుకో స్పష్టం చేయాలి. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో మూడు నెలలుగా రోజుకో సీరియల్ నడిపి ప్రభాకర్ రావును ఇవాళ అరెస్ట్ చేస్తాం, రేపు తీసుకువచ్చి విచారిస్తాం, ఎల్లుండి కేసీఆర్‌ను కూడా అరెస్ట్ చేస్తామంటూ చేసిన ప్రకటనలు ప్రగల్భాలేనా అంటూ నిలదీశారు.






