- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP Laxman: బీసీ ఆర్డినెన్స్ కు గవర్నర్ సంతకంపై ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని ఓ వైపు రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు పెండింగ్ లో ఉండగా మరో వైపు ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదించే అవకాశం ఉందా? అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రభుత్వ బూసాని వెంకటేశ్వరరావు నివేదికను బహిర్గతం చేయకుండా ఎందుకు దాచిపెడుతోందని ప్రభుత్వానికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వం బీసీలను రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుని లబ్దిపొందే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకముందే కాంగ్రెస్ సంబరాలు చేస్తుంటే బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఆర్డినెన్స్ ను ఓ వైపు ఎమ్మెల్సీ కవిత స్వాగతిస్తుంటే మరో వైపు మిగతా బీఆర్ఎస్ నేతలు ఇది సాధ్యం కాదంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు కాబట్టి నెరవేర్చాలన్నారు. గతంలో బిల్లు ఇచ్చి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని ఆర్డినెన్స్ పేరుతో హడావిడి చేస్తోందన్నారు.
అసలు బీసీలు ఎక్కడికి పోవాలి?:
తెలంగాణ మోడల్ ను రోల్ మోడల్ అని కాంగ్రెస్ చెబుతోంది. కానీ ఇక్కడ జరిగిన సర్వే అంతా తప్పుల తడక అని లక్ష్మణ్ విమర్శించారు. అంటే దేశమంతటా ఇదే రకంగా మోసం చేస్తారా అని ప్రశ్నించారు. బీసీలలో ముస్లింలను చూపిస్తూ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు కేటాయించి బీసీల హక్కులను కాలరాస్తారా అని నిలదీశారు. ముస్లింలకు బీసీల కోటాలో రిజర్వేషన్లు ఇస్తే మరి అసలు బీసీలు ఎక్కడికి పోవాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డెడికేషన్ కమిటీ సేకరించిన సమాచారం మేరకు కేటగిరిల వారిగనైనా లెక్కలు చెప్పాలన్నారు. న్యాయపరమైన గణాంకాలు బహిర్గతం చేయకుండా ముందుకు వెళ్లడం సరికాదన్నారు. చట్టప్రకారం సాధ్యం కాకపోతే పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ పార్టీ పరంగా ఇస్తే ఒరిగేదేముందని ప్రశ్నించారు. అసలు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గుర్తులే ఉండవని అలాంటప్పుడు ఏ రకంగా బీసీలకు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చిన హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీది దగా మోసం అని బీజేపీ బీసీలను ఏకం చేసి కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతామన్నారు.
రాజకీయం అన్నాక కేవలం బీసీలే కాదు:
రాజకీయం అన్నాక కేవలం బీసీలు మాత్రమే కాదని అన్ని కులాలు అవసరమే అన్నారు. పార్టీ సామాజిక సమీకరణాల్లో భాగంగానే రామచందర్ రావును స్టేట్ ప్రెసిడెంట్ గా అధిష్టానం నిర్ణయించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ పార్టీ ప్రకటించని విధంగా మొట్టమొదటి సారి బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. బండారు దత్తాత్రేయ, బండి సంజయ్, నేను బీసీలమేననని మేమంతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేయలేదా అని ప్రశ్నించారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన రామచందర్ రావుకు ప్రమోషన్ లో భాగంగానే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను కిషన్ రెడ్డి ఖండించారు.






