కేంద్ర మంత్రులతో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ.. ఎందుకంటే..?

by Ramesh Naini |

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.

కేంద్ర మంత్రులతో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ.. ఎందుకంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మొదట కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్. పాటిల్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాలు అందజేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం వల్ల జన సాంద్రత పెరిగిందని ఈటల మంత్రికి వివరించారు. కానీ ఎప్పుడో నిర్మించిన మురుగునీటి పారుదల వ్యవస్థ మాత్రమే ఉండడం వల్ల నిత్యం డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని, జల కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ ద్వారా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ అండ్ సీవరేజ్ బోర్డ్‌కు రూ.133.5 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు.

అలాగే కేంద్ర గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అని,అనేక కాలనీలో కొత్తగా ఏర్పడుతున్నాయని ఈటల మంత్రికి వివరించారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కొత్తగా ఏర్పడిన కాలనీలతో పాటు నియోజకవర్గంలో డ్రైనేజీలు, మంచినీటి సదుపాయం, సీసీ రోడ్ల నిర్మాణం కొరకు రూ.150 కోట్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కోరారు. ఇందుకు మంత్రి మనోహర్ లాల్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Next Story