నిజామాబాద్‌ను కరీంనగర్‌తో పోల్చలేం: MP అర్వింద్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో 20 ఏళ్లుగా పార్టీని పట్టి పీడిస్తున్న కోవర్టులు వెంటనే పార్టీ వీడి వెళ్లిపోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

నిజామాబాద్‌ను కరీంనగర్‌తో పోల్చలేం: MP అర్వింద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 20 ఏళ్లుగా పార్టీని పట్టి పీడిస్తున్న కోవర్టులు వెంటనే పార్టీ వీడి వెళ్లిపోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్‌ను కరీంనగర్‌తో పోల్చలేమని.. ఇక్కడ ముస్లింల సంఖ్య ఎక్కువ అని అన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడిందని.. దక్షిణ తెలంగాణలో బలోపేతం కావాల్సి ఉన్నదని చెప్పారు. నిజామాబాద్‌లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చిందని.. కేసులకు భయపడే ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కుటుంబ అవినీతిని ఎవరూ అడగకుండా ఉండేందుకు కొనడం మొదలు పెట్టారని.. కేసీఆరే వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి దానిని కొనసాగిస్తున్నారని చెప్పారు. తాము ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని అనుకున్నామని.. అందుకే ఎవరితోనూ కలవలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని.. వారు కలిసి ఉండడం అసంభమని అన్నారు.

కవిత వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరు ఎవరి వల్ల భూస్థాపితం అయ్యారో కవితకు తెలియదా అని ప్రశ్నించారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజాస్వామ్య విలువలను పాటించారని తెలిపారు. బీజేపీకి భయపడి రాయికల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని.. మెట్‌పల్లిలో పార్టీ కోవర్టు వెళ్లిపోయారని.. పార్టీకి పట్టిన పీడ పోయిందని అన్నారు. సుఖేందర్ కోవర్టు కేసు అని.. ఆయనకు, ఆయన భార్యకు ఇద్దరికీ టికెట్ ఇవ్వనని చెప్పినట్లు తెలిపారు. వీక్ క్యాండిడేట్‌ను పెడుతామని కాంగ్రెస్ వాళ్లు సుఖేందర్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పారని.. అలాంటివారు 20 ఏళ్లుగా బీజేపీని మోస్తున్న అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అలాంటి వారే కొందరు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇప్పుడు తన చేతికి మట్టి అంటకుండా ప్రక్షాళన జరిగిందని.. ఇలాంటి వారు ఎక్కడ ఉన్నా బయటకు వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పటికే ఇందూరు ప్రక్షాళన పూర్తయిందని.. జగిత్యాలను సైతం ప్రక్షాళన చేస్తానని చెప్పారు.

Next Story