MP Chamala: ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్ట్.. ప్రశాంత్ కిషోర్‌పై ఎంపీ చామల కిరణ్ ఫైర్

by Ramesh Naini |   (  Updated:2025-10-04 10:53:48  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

MP Chamala: ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్ట్.. ప్రశాంత్ కిషోర్‌పై ఎంపీ చామల కిరణ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. ‘భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇతర రాజకీయ నాయకులపై విమర్శలతో రాజకీయాలు చేస్తూ మీరే గొప్పవారని భావిస్తూ భ్రమలో జీవిస్తున్నారు. మీరు కొన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అయిన పొలిటికల్ అనలిస్ట్, ఇప్పుడు “జన్ సూరాజ్” పార్టీతో బీహార్ ప్రజలను ఆకర్షించాలనుకుంటున్నారు కానీ మీ సిద్ధాంతాలు అక్కడి రాజకీయంలో పని చేయలేకపోతున్నాయి’ అని తీవ్ర విమర్శలు చేశారు.

ప్రజల దృష్టిని మీవైపునకు తిప్పుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఎందుకు..? అని ఎంపీ చామల ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల కోసం మాత్రమే ఇలా చేస్తూ ప్రతి ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి పేరున వాడటం సరైన పద్ధతి కాదని సూచించారు. బీహార్ అభివృద్ధి కోసం ప్రణాళికలు చెప్పకుండా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను విమర్శించడం సరైనది కాదని హితవు పలికారు. ప్రజల వలసలను తగ్గించడం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. కాగా, తాజాగా ప్రశాంత్ కిషోర్ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

బీహార్ ప్రజలను తక్కువ చేసి హేళనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి తమ గడ్డపై అడుగు పెడితే తరిమికొడతామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి వెళ్లి మరీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తన నుంచి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, మోడీ కాదు కదా ఎవరూ కాపడలేరని, బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడని, మళ్లీ తిరిగి ఇంకోసారి గెలిచే సత్తా రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. అలాగే బీహార్ ప్రజల DNA తెలంగాణ ప్రజల DNA కంటే తక్కువ అయినప్పుడు. ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని నన్ను మూడు సార్లు ఎందుకు అడిగాడని పీకే ప్రశ్నించారు.

Next Story