బీఆర్ఎస్‌లో అభ్యర్థుల ఉదాసీనత.. కాంగ్రెస్‌లోకి జంప్?

by Naga Rani Yarlagadda |

బీఆర్‌ఎస్ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వర్​రావు, చేవేళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మహబూబ్‌నగర్​అభ్యర్థి శ్రీనివాస్​రెడ్డి, మెదక్​క్యాండిడేట్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఏదో ఒకసారి పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తామంతా పార్టీలోనే ఉన్నామని చెప్పుకోవడానికి గెస్టుల్లాగా వస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు

బీఆర్ఎస్‌లో అభ్యర్థుల ఉదాసీనత.. కాంగ్రెస్‌లోకి జంప్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీచేసిన వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవైపు ఎన్నికల్లో ఓడిపోయిన నిరాశ, మరోవైపు పార్టీ అధికారంలో లేకపోవడంతో వారంతా ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. గత‌ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. 8 చోట్ల డిపాజిట్లు దక్కకపోగా ఖమ్మం, మహబూబాబాద్​స్థానాల్లో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన స్థానాల్లో మూడు, నాలుగో స్థానానికి పరిమితమైంది. దీంతో అభ్యర్థులు, పార్టీ సీనియర్లు, కేడర్ తీవ్ర నిరాశకు గురైంది. ఫలితాల తర్వాత అభ్యర్థులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి కూడా చూపించడం లేదు.

నలుగురు అభ్యర్థులు దూరం..

దాదాపు నలుగురు ఎంపీ అభ్యర్థులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరో ముగ్గురు ఏకంగా అధికార పార్టీలో చేరారు. వీరి వ్యవహారశైలిపై పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓడిపోతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరా? అని నిలదీస్తున్నారు. ఒకవేళ ఎంపీ అభ్యర్థులు ఓడినా.. పార్టీ అధికారంలో ఉంటే చురుగ్గా ఉండే వారు కాదా? అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉంటేనే తాము పనిచేస్తాం, పార్టీలో చురుగ్గా తిరుగుతామనే సంకేతాలు ఇస్తున్నారా? అంటూ నిలదీస్తున్నారు. ఎన్నికల సమయంలో గెలుపు ధీమాతో చాలా మంది టికెట్ ఆశించి తమ బలాన్ని, బలగాన్ని ప్రదర్శించారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చారు. తీరా ఫలితాలు చూశాక వారంతా అప్‌సెట్ అయినట్లు తెలిసింది.

కాంగ్రెస్‌లోకి ముగ్గురు క్యాండిడేట్స్..

బీఆర్‌ఎస్ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వర్​రావు, చేవేళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మహబూబ్‌నగర్​అభ్యర్థి శ్రీనివాస్​రెడ్డి, మెదక్​క్యాండిడేట్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఏదో ఒకసారి పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తామంతా పార్టీలోనే ఉన్నామని చెప్పుకోవడానికి గెస్టుల్లాగా వస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. జహీరాబాద్​అభ్యర్థి అనిల్ కుమార్, ఆదిలాబాద్​నుంచి అత్రం సక్కు, హైదరాబాద్​నుంచి పోటీ చేసిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే​కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో అవకాశాలు రాక చాలా మంది ఎదురు చూస్తుంటే అవకాశాలు వచ్చిన వారు మాత్రం అధికారంలో లేకుంటే పార్టీ మాకెందుకు? కార్యకలాపాల్లో ఎందుకు పాల్గొనాలి? అనేలా వ్యవహరించడం సరికాదని వారు అంటున్నారు. అనేక పదవులు అనుభవించిన వారు సైతం ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శిలొస్తున్నాయి. ఎంపీ అభ్యర్థుల విజయం కోసం అనేక మంది లీడర్లు, కార్యకర్తలు కష్టించి పనిచేశారని, పార్టీ అధికారంలో లేకపోవడంతో కష్టకాలంలో తమకేం సంబంధం లేదనేలా ఎంపీ అభ్యర్థులు వ్యవహరించడంపై పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తమవుతున్నది.

Next Story