రాష్ట్రంలో రాచరిక పాలన : కాంగ్రెస్ పై మండిపడ్డ సత్యవతి రాథోడ్

by Muthe.Rajitha |

రాష్ట్రంలో రాచరికపు పాలన నడుస్తున్నదని.. రాచరిక పాలన చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

రాష్ట్రంలో రాచరిక పాలన : కాంగ్రెస్ పై మండిపడ్డ సత్యవతి రాథోడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాచరికపు పాలన నడుస్తున్నదని.. రాచరిక పాలన చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ట్రాఫిక్ చూస్తే పరిపాలన ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. బాలాపూర్‌లో రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డికి అవమానం జరిగిందని.. ప్రొటోకాల్ పాటించాలని ఆమె కోరడం తప్పా అని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం మహిళలను గౌరవించాలనే ఇంగితజ్ఞానం కాంగ్రెస్ పార్టీకి లేకుండాపోయిందన్నారు.

ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఓట్లు వేయించుకోని మహిళలను అవమానిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కనీస గౌరవం ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్‌ను తిట్టకపోతే తమ పోస్టింగులు ఉంటాయో లేదో అని అధికారులు భయపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్ష రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వడంలేదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు 4లక్షలు ఇస్తామని 2 ఇళ్ళు మాత్రమే పూర్తిచేశారని.. 2 ఇళ్ళు కట్టడానికి 20 నెలలు పట్టిందని అన్నారు. 4 లక్షల ఇళ్లు కట్టడానికి ఎన్నిరోజులు పడుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో హెలికాప్టర్లలో పోయి రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు.

బీసీ రిజర్వేషన్ల పేరుతో ఢిల్లీలో కొత్త డ్రామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. కరీంనగర్ జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. సబితాఇంద్రారెడ్డి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు దుర్మార్గమన్నారు. శ్రీధర్‌బాబు వేదికపై ఉండగానే ఆమెకు అవమానం జరిగిందన్నారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వ ప్రోగ్రామ్ కాకపోతే గాంధీ భవన్‌లో పంచండి అని సూచించారు.

Next Story