Pochampally: నా హక్కును తుంగలోకి తొక్కారు: ఎమ్మెల్సీ పోచంపల్లి

by Prasad Jukanti |   (  Updated:2026-02-16 07:16:07  IST  )

మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటు హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pochampally: నా హక్కును తుంగలోకి తొక్కారు: ఎమ్మెల్సీ పోచంపల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఎక్స్ అఫీషియో (Ex-Officio Vote) సభ్యుల ఓటు హక్కు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (MLC Pochampally Srinivas Reddy) విమర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తనను నామినేటెడ్ ఎమ్మెల్సీగా గుర్తిస్తూ తనకు రాజ్యంగబద్ధంగా లభించే ఎక్స్ అఫీషియో ఓటు హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ నిరాకరించారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేస్తూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.

ఆ హక్కు నాకుంది:

లోకల్ బాడీ ఎమ్మెల్సీగా లోకల్ కౌన్సిలర్లు ఓటు వేస్తేనే గెలిచిన తనకు వరంగల్‍లోని 12 నియోజకవర్గాల్లో ఎక్కడైనా మున్సిపల్ చైర్మన్ కోసం ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకునే హక్కు తనకు ఉంటుందన్నారు. కానీ, ఆ హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాయడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేని మండిపడ్డారు. కాగా, జనగామ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు కోసం పోచంపల్లి శ్రీనివాస్‌‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన సదరు పురపాలిక పరిధిలో ఓటరుగా లేనందున ఆయన ఎక్స్ అఫిషియో ఓటరుగా వ్యవహరించేందుకు నిరాకరించింది. ఈ మేరకు ఆయన అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను ఎక్స్‌లో షేర్ చేస్తూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
Next Story