- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దురుద్దేశంతోనే నా నిధులకు బ్రేక్.. మంత్రి సమీక్షను బహిష్కరించిన ఎమ్మెల్సీ పోచంపల్లి!
తన పెండింగ్ ప్రతిపాదనలపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని.. ఎమ్మెల్సీగా తన హక్కులను ఉల్లంఘించారని శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తన పెండింగ్ ప్రతిపాదనలపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని.. ఎమ్మెల్సీగా తన హక్కులను ఉల్లంఘించారని శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని టీజీఎస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరు కావడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. తన ప్రతిపాదనలను పెండింగులో పెట్టడం ద్వారా ప్రజా ప్రతినిధి గౌరవం, అధికార ప్రతిష్ట, రాజ్యాంగబద్ధ స్థాయిని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి అందుబాటులో ఉన్న నిధుల మేరకు రూ.248.40 లక్షల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు.
అందుబాటులో ఉన్న నిధులలో కేవలం 50 శాతం అంటే రూ.124.20 లక్షల మేర మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు సూచించారని.. ఆ మేరకు పనులు సిఫార్సు చేయబడి కలెక్టర్ ద్వారా పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని వెల్లడించారు. మిగిలిన రూ.124.20 లక్షల నిధులకు అనుమతి మంజూరు చేయాలని లేఖ ద్వారా ప్రతిపాదనలు సమర్పించానని తెలిపారు. అయితే.. జీవో 3లో నిబంధనలున్నప్పటికీ ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు ఎటువంటి ఆమోదం లేకుండా పెండింగ్‌లో పెట్టారని పేర్కొన్నారు. ఈ ఆలస్యం తన నియోజకవర్గంలోని ప్రజా ప్రయోజన అభివృద్ధి పనులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. సరైన కారణం లేకుండా తన ప్రతిపాదనలను నిరంతరం దురుద్దేశ పూర్వకంగానే పెండింగులో పెట్టినట్లు స్పష్టమవుతున్నదని.. ఇటువంటి చర్యలు శాసన మండలి సభ్యునిగా తన హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శాసన మండలి సభ్యుడిగా తాను సమర్పించిన అభివృద్ధి ప్రతిపాదనలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంచబడిన నేపథ్యంలో.. సమావేశానికి హాజరు కావడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.






