- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగుల హెల్త్ ట్రస్ట్‌పై స్పష్టత ఇవ్వాలి: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలతో పాటు ప్రతిపాదిత ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్ సీటీ) అమలుపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన విధివిధానాలను ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలతో పాటు ప్రతిపాదిత ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్ సీటీ) అమలుపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన విధివిధానాలను ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈహెచ్ సీటీ అమలు పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులపై అదనపు ఆర్థిక భారం మోపకూడదని, సంపూర్ణ మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాతే ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యంగా కొత్త పీఆర్‌సీ అమలు చేసిన తర్వాతే హెల్త్ ట్రస్ట్ కోసం ఉద్యోగుల వాటాను వసూలు చేయాలని, అప్పటి వరకు ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఆయన స్పష్టం చేశారు. మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, ఎస్‌ఎస్‌ఏ, యూఆర్‌ఎస్, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల సంస్థల్లో పనిచేస్తున్న శాశ్వత, తాత్కాలిక ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేశామని చెబుతున్న రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. కలెక్టర్లను డీఈవోలుగా నియమించే విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ప్రస్తుతం జనగామ జిల్లాలో డీఈవోగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ను మార్చాలని కోరారు. ఈ సమావేశంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పెంటయ్య, ఆర్గనైజేషన్ కార్యదర్శి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.






