MLC Kavitha: పంతానికి పోయి రైతులను కన్నీరు పెట్టిస్తున్నారు

by Gantepaka Srikanth |

అప్పులపై కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడానికి ఎన్నో తిప్పలు పడ్డారని.. అవన్నీ పటాపంచలు అయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

MLC Kavitha: పంతానికి పోయి రైతులను కన్నీరు పెట్టిస్తున్నారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అప్పులపై కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడానికి ఎన్నో తిప్పలు పడ్డారని.. అవన్నీ పటాపంచలు అయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అప్పులపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం పార్లమెంటు సాక్షిగా బయటపడిందని తెలిపారు. రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల 42 వేల కోట్లు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని రెండింతలు చేసి రూ.8 లక్షల కోట్లు చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికైనా నిజాలు చెప్పాలని సూచించారు. అబద్ధాలు చెబుతున్నామని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుందని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన భారీ అప్పులపై ప్రజల దృష్టిని మళ్లించడానికి సీఎం రాజకీయ నాటకాలకు తెరలేపారని మండిపడ్డారు.

కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోతాయన్న దాంట్లో వాస్తవం లేదని స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసన సభలో చెప్పారని, మరి ఆ ప్రాజెక్టులను వినియోగించుకొని సాగుకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పంటలు ఎండిపోతున్నా పంతానికి పోయి రైతులకు కన్నీళ్లు మిగిలిస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం మహాకుంభమేళా తరహాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే.. శాసన మండలిలో ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ వ్యవహరించిందని, సమన్వయంతో అన్ని అవకాశాలను వాడుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించామని వివరించారు. ప్రతిరోజూ వినూత్న రీతిలో నిరసనలు తెలియజేశామని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తాము చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చిందని, ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తామని మండలి సాక్షిగా సీఎం ప్రకటించారని స్పష్టం చేశారు. ఈ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని, బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాయని, ఆ బిల్లులు రావడానికి బీఆర్ఎస్ కృషి ఎంతో ఉందని వివరించారు.

Next Story