- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటల రాజేందర్ కూడా మాట్లాడకపోవడం శోచనీయం: MLC కవిత
కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్‌హౌజ్ పనులు చేసిన మేఘా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు విచారణకు ఎందుకు పిలవడం లేదని.. ఆయనను పిలిచే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్‌హౌజ్ పనులు చేసిన మేఘా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు విచారణకు ఎందుకు పిలవడం లేదని.. ఆయనను పిలిచే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టారు. ధర్నాలో కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నదని ధ్వజమెత్తారు. 90 శాతం పంప్‌హౌజ్‌ల పనులు చేసిన కాంట్రాక్టర్‌ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయించిందని మండిపడ్డారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు జారీ చేశారని ప్రశ్నించారు. ఆయనకు నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్లేనని స్పష్టం చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని.. కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని విమర్శించారు. కమిషన్‌పై తమకు ఉన్నదని.. కానీ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసం లేదని స్పష్టం చేశారు.
కాళేశ్వరంతో 35 శాతంగా తెలంగాణకు నీళ్లు..
కాళేశ్వరంలో వాడిన స్టీల్‌తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చని.. కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్‌తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చని కవిత అన్నారు. అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అని.. ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందని తెలిపారు. 40 టీఎంసీలతో హైదరాబాద్‌కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పారు. మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందుతాయన్నారు. 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి ఎత్తిపోసే ప్రాజెక్టు అని.. కేసీఆర్ గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదని ఎద్దేవా చేశారు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్‌ను బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని స్పష్టం చేశారు. మేడిగడ్డకు చిన్నచిన్న మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతున్నదని ఆరోపించారు.
బనకచర్లను ఎందుకు వ్యతిరేకించరు..?
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని కవిత నిలదీశారు. తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే సీఎం కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని అడిగారు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడీ చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. బీజేపీలో ఉన్న ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ సైతం మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు. బకనచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలని అన్నారు. గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్నిరకాల అనుమతులు ఉన్నాయని, జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రాజెక్టు కట్టిందే దాదాపు రూ.80,000 కోట్లతో అని స్పష్టం చేశారు. లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగినట్లు అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు ధాస్యం విజయభాస్కర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు, యువజన రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ గౌడ్, మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు మరిపెల్లి మాధవి, విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు రాము యాదవ్, జాగృతి నాయకులు అప్పాల నరేందర్ యాదవ్, జాగృతి ఇటలి అధ్యక్షుడు తానింకి కిషోర్ యాదవ్, పబ్బోజు విజేందర్, ఈగ సంతోష్, అర్చన సేనాపతి, మాడ హరీశ్ రెడ్డి, లలిత యాదవ్, పరకాల మనోజ్ గౌడ్, మహేందర్ ముదిరాజ్, యూపీఎఫ్ కన్వీనర్ బొల్లా శివశంకర్, కో ఆర్డినేటర్ ఆలకుంట హరి, యూపీఎఫ్ కో కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.






