- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పసుపు బోర్డు ప్రకటనను స్వాగతించిన MLC కవిత.. MP ధర్మపురి అర్వింద్‌పై ఘాటు వ్యాఖ్యలు
నిజామాబాద్(Nizamabad) కేంద్రంగా పసుపు బోర్డు(Pasupu Board) ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్(Nizamabad) కేంద్రంగా పసుపు బోర్డు(Pasupu Board) ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్ సభలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తాజాగా.. ఈ పసును బోర్డు ఏర్పాటు ప్రకటనపై బీఆర్ఎస్(BRS) మహిళా నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పందించారు. ఆదివారం నిజామాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కానీ బోర్డు కార్యాలయ ఏర్పాటు తీరును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమంలా చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా ప్రోటొకాల్‌ను విస్మరించారని అన్నారు. కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు.
‘2014లో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)కు లేఖ రాశాను. ప్రధాన మంత్రిని నరేంద్ర మోడీని రెండు సార్లు కలిశాను. పసుపు బోర్డు(Pasupu Board) ఏర్పాటుకు ప్రయత్నం చేశాను. పసుపుకు రూ.15 వేల మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశాను. త్రిముఖవ్యూహంతో అలుపెరగని పోరాటం చేశాను’ అని కవిత తెలిపారు. కేవలం బోర్డు రావడం మాత్రమే సరిపోదని.. మద్దతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని చెప్పారు. ఇతర దేశాల నుంచి నాణ్యతలేని పసుపు దిగుమతి అవుతోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు. పసుపు దిగుమతులను నియంత్రించాలని ఎప్పటి నుంచో నేను డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఎంపీ అర్వింద్(MP Arvind)కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటు అని విమర్శించారు. తాము పసుపు బోర్డు పోరాటం మొదలెట్టిన రోజుల్లో అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రిచాటు బిడ్డగా ఉన్నారని గుర్తుచేశారు. ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్‌పై రాసిచ్చిన అర్వింద్.. ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బాగుటుందని అన్నారని గుర్తుచేశారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారులాంటిది.. పసుపు బోర్డు అంబాసిడర్ కారులాంటిదని అర్వింద్ అన్నారని కవిత తెలిపారు. ఎవరు ఏం చేయకున్నా ప్రతి మూడో సంవత్సరం పసుపు ధర పెరుగుతుంది. దానిని అర్వింద్ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. రైతాంగాన్ని బీజేపీ మోసం చేయడం ఆపేయాలి. స్పైసెస్ పార్కు ఏర్పాటుకు వేల్పూర్ వద్ద కేసీఆర్ ప్రభుత్వం 42 ఎకరాలు కేటాయించారు. ఆ పార్కులో పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. జాక్రాన్ పల్లిలో విమానాశ్రయానికి కేసీఆర్ ప్రభుత్వం 800 ఎకరాలు సేకరించింది. అక్కడ ఎయిర్ పోర్టు తీసుకురావాలని ఎంపీ అర్వింద్‌ను ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.






