- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీకి 8 మంది ఎంపీలు ఉండి ఏం లాభం?: ఎమ్మెల్సీ కవిత సీరియస్
కేవలం 18 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి రేవంత్‌రెడ్డి కమీషన్లు మెక్కి అవినీతి చక్రవర్తి అయ్యారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేవలం 18 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి రేవంత్‌రెడ్డి కమీషన్లు మెక్కి అవినీతి చక్రవర్తి అయ్యారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై త్వరలోనే పుస్తకం ప్రచురించి రాష్ట్రమంతా పంచుతామన్నారు. గతంలో ఒక నాయకుడి కరప్షన్‌పై పుస్తకం వేశారని.. రేవంత్ అవినీతిపై పుస్తకంలో సమగ్రంగా వివరిస్తామని వెల్లడించారు. కొత్తగా ఒక్క పథకం అమలు చేయకుండా, ఒక్క పింఛన్ మంజూరు చేయకుండా, పింఛన్లు పెంచకుండా, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వకుండా అప్పు తెచ్చిన రూ.2 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో క్రమశిక్షణతో లోన్లు రీ పేమెంట్ చేసి ఏ గ్రేడ్ రేటింగ్‌లో ఉన్న రాష్ట్రాన్ని రేవంత్‌రెడ్డి డిఫాల్ట్ స్టేట్ స్థితికి దిగజార్చారని మండిపడ్డారు.
అప్పులు ఎవరికి చెల్లిస్తున్నారు?
ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నుంచి తెచ్చిన లోన్లను ఈ ప్రభుత్వం సరైన సమయానికి తిరిగి చెల్లించడం లేదని కవిత అన్నారు. ఇన్‌స్టాల్‌మెంట్ల పేమెంట్‌లో డిఫాల్ట్ స్టేజీకి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని.. అందుకు ఆర్ఈసీ రాసిన లేఖనే సాక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి మాటకు ముందు కేసీఆర్ చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికే అప్పులు చేస్తున్నామని చెప్తున్నారని.. ఆయన చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలని ఆర్ఈసీ లేఖతో తేలిపోయిందన్నారు. ఇప్పటివరకు ఏ అప్పులు చెల్లించారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఈసీకి రూ.1,320 కోట్లను ఈనెల 28వ తేదీలోపు చెల్లించాలని లేఖ రాసిందని.. సమయానికి రీ పేమెంట్ చేయకపోతే దివాళాగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించినా ఏ ఒక్క కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల సంస్కృతి మొదలైందన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం అనే ప్రాజెక్టు కోసం రూ.1200 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని ఆరోపించారు. చెంచా మట్టి కూడా తీయకుండా ముందస్తు చెల్లింపులు చేయడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అంటే రేవంత్‌కు భయం
2024 జూలై 6వ తేదీన ప్రజాభవన్‌లో రేవంత్‌రెడ్డితో సమావేశమైన తర్వాతే చంద్రబాబునాయుడు పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని కవిత ఆరోపించారు. 2016లో పోలవరం నుంచి బనకచర్ల లింక్ అనే ప్రాజెక్టు ప్రస్తావనే లేదన్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు లేదని ఆంధ్రా మేధావులు సైతం చెప్తున్నారని.. కేవలం మేఘా ఇంజినీరింగ్ సంస్థకు లాభం చేయడానికే ఈ ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికీ బనకచర్లపై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేయడం లేదన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు హైదరాబాద్ బిర్యానీ తినిపించి గోదావరి నీళ్లను గిఫ్ట్ ప్యాక్‌గా ఇచ్చారని ఆరోపించారు.
8 మంది ఎంపీలుండి ఏం లాభం?
పోలవరం ముంపు సమస్యను చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రగతి ఎజెండాలో చేర్చి చివరి నిమిషంలో ఎత్తివేసిందని కవిత మండిపడ్డారు. భద్రాచల రాముడు పోలవరంలో మునుగుతున్నా తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు వెంటనే తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పూణే మెట్రో రైల్‌కు కేంద్ర కేబినెట్‌లో రూ.3,500 కోట్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఎందుకు నిధులు ఇవ్వలేదని నిలదీశారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలకు నిధులు తెచ్చే సత్తా లేదని మండిపడ్డారు.






