MLC Kavitha: మహిళను చితకబాదడమే ప్రజాపాలనా.. ఎమ్మెల్సీ కవిత సెన్సేషనల్ ట్వీట్

by Kema Shiva Kumar |

నిజామాబాద్ జిల్లా (Nizamabad District) పరిధిలో పర్సు పోయిందని ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. సీఐ చితకబాదిన ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

MLC Kavitha: మహిళను చితకబాదడమే ప్రజాపాలనా.. ఎమ్మెల్సీ కవిత సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా (Nizamabad District) పరిధిలో పర్సు పోయిందని ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. సీఐ చితకబాదిన ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ‘X’‌ (ట్విట్టర్)లో ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేనా ప్రజా పాలనా.. అంటూ సర్కార్‌ను ప్రశ్నించారు. ఓ ఆడబిడ్డకు కష్టం చెప్పుకోవడానికి వస్తే, కుటుంబ పెద్దగా సమస్యను పరిష్కరించాల్సిన పోలీసు అధికారి.. మానవత్వం మరిచి మహిళపై లాఠీతో దాడి చేయడం అమానుషమని అన్నారు. భాగ్యపై దాడి చేసిన సీఐపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత మహిళకు సత్వరం న్యాయం చేయాలి ఆమె డీజీపీని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు పూర్తి స్థాయి పోలీస్ కమిషనర్‌ (Commissioner of Police)ను నియమించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని డిమాండ్ చేస్తున్నా.. అంటూ కవిత ట్వీట్ చేశారు.

అసలు ఏం జరిగిందంటే..

నిజామాబాద్ జిల్లా (Nizamabad District) రెంజల్ (Rangel) మండలం దూపల్లి (Dupally) గ్రామానికి చెందిన బోయ భాగ్య తన కుమారుడితో కలిసి శుక్రవారం జానకంపేట (Janakampet) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఉత్తవాలకు వెళ్లింది. అయితే, భాగ్య జాతరలో తన పర్సును పోగొట్టుకుంది. అయితే, అక్కడే ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు (CI Vijay Babu) వద్దకు వెళ్లి తన పర్సు పోయిందని భాగ్య చెప్పింది. దీంతో ఆయన దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నావంటూ ఆమెపై ఆగ్రహంతో ఊగిపోయాడు. అనంతరం తన వద్ద ఉన్న లాఠీతో భాగ్య కాళ్లు, నడుము భాగంలో వాతలు వచ్చేలా కొట్టాడు. దీంతో బాధితురాలు సీఐపై ఎడపల్లి పోలీస్ స్టేషన్‌ (Edapally Police Station)లో ఫిర్యాదు చేసింది.

Next Story