కవిత చుట్టూ స్టేట్ పాలిటిక్స్.. ఎన్నికల్లో లబ్ది పొందేలా 3 పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు!

by Disha Web Desk 19 |
కవిత చుట్టూ స్టేట్ పాలిటిక్స్.. ఎన్నికల్లో లబ్ది పొందేలా 3 పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు వ్యవహారం మూడు ప్రధాన పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కవిత అరెస్టయితే తమకు మైలేజీ వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం సెంటిమెంట్ రగిలించి లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తోంది. ఒకవేళ అరెస్ట్ కాకపోతే .. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారం చేసి లాభం పొందాలని కాంగ్రెస్ స్కెచ్ వేసింది. మొత్తంగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మొత్తం కవిత అరెస్ట్ కేంద్రంగానే సాగుతున్నాయి.

బీజేపీ డీలా..

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక మొదలు రాష్ట్రంలో బలపడుతూ వచ్చిన బీజేపీ తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఫలితాలతో డిఫెన్స్ పడింది. శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొన్నది. నేతలు కూడా డైలమాలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామంటూ ఇంతకాలం దీమాగా ఉన్న బీజేపీ .. ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రజల్లోనూ బీజేపీపై చర్చలు తగ్గాయి. కవిత అరెస్టు కాకపోతే ఆ అంశం బీజేపీకి మైనస్‌గా మారుతుందంటూ ఆ పార్టీకి చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు బహిరంగంగానే కామెంట్లు చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ ప్రచారం..

కవిత అరెస్టుపై కాంగ్రెస్ నేతలు సైతం పరోక్షంగా పలు రకాల కామెంట్లు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని, ఆ రెండు పార్టీల మధ్య రహస్యంగా అండర్‌స్టాండింగ్ ఉన్నదని, అందుకే కవితను అరెస్టు చేయడంలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల కామెంట్లతో ఇప్పుడు బీజేపీ ఆత్మరక్షణలో పడినట్లయింది.

బీఆర్ఎస్ ప్లాన్ ఇదే..

కవితను అరెస్టు చేస్తే దాన్ని రాజకీయ అస్త్రంగా మల్చుకోడానికి బీఆర్ఎస్ రెడీ అవుతున్నది. దర్యాప్తు సంస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని విపక్షాలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని మరింత ఘాటుగా విమర్శలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థల తీరును వ్యతిరేకిస్తూ విపక్షాలన్నీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో బీఆర్ఎస్ కూడా ఒక పార్టీగా ఉన్నది.


Next Story

Most Viewed