MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్రం.. ఆ పార్టీ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు!

by Kema Shiva Kumar |

మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో కష్టపడుతున్నట్టు గులాబీ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతున్నది.

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్రం.. ఆ పార్టీ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో కష్టపడుతున్నట్టు గులాబీ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతున్నది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని బీఆర్ఎస్ లీడర్లు తమ కేడర్‌తో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా పనిచేయిస్తున్నట్టు తెలుస్తున్నది. సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఓటర్లతో మంతనాలు సైతం జరుపుతున్నట్టు టాక్. కొందరు సీనియర్ లీడర్లు సైతం ఆయన గెలుపుకోసం ఏకంగా డబ్బులు సైతం ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

నేరుగా ఓటర్లను కలుస్తున్న గులాబీ టీం

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ 18 స్థానాల్లో విజయం సాధించింది. కొంత కాలంగా ఆ జిల్లాల్లో పార్టీ యాక్టివిటీస్ సైతం మొదలయ్యాయి. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి మాత్రం గులాబీ పార్టీ దూరంగా ఉంటున్నది. గత వారం రోజులుగా ఆ పార్టీ లీడర్లు బీఎస్పీ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్టు తెలిసింది. రహస్యంగా తమ కేడర్‌ను రంగంలోకి దింపి, ఓటర్ల దగ్గరకు పంపిస్తున్నట్టు టాక్. బీఎస్పీ అభ్యర్థికి ఓటు వేయాలని గులాబీ కార్యకర్తలు ఓటర్లను కోరుతున్నట్టు తెలిసింది. కొందరు విద్యావంతులకు మాజీ మంత్రులు ఫోన్ చేసి ప్రసన్న హరికృష్ణకు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టు సమాచారం.

సీనియర్ నేతల ఖర్చు!

కొందరు బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు.. ప్రసన్న కుమార్ గెలుపు కోసం సొంతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. తమ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాను తెప్పించుకుని వారికి నేరుగా ఫోన్ చేసి మాట్లాడటంతో పాటు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించినట్టు సమాచారం. అనంతరం భోజనాలు, విందులు సైతం ఆఫర్ చేసినట్టు టాక్. అందుకు అవసరమైన ఖర్చులను గులాబీ నేతలే స్వయంగా భరించినట్టు క్షేత్ర స్థాయిలో ప్రచారం సాగుతున్నది. కొందరు మాజీ మంత్రులు ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఏకంగా ఫోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెట్టినట్టు చర్చ జరుగుతున్నది.

రహస్య ఎజెండా వెనుక టార్గెట్?

నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ తన పొలిటికల్ ప్లాన్‌ను అమలు చేస్తున్నట్టు ప్రచారం జరగుతున్నది. నేరుగా ఓటర్లను కలిసి బీఎస్పీ అభ్యర్థికి ఓటేయాలని ప్రచారం చేయడం వెనుక ఉన్న వ్యూహం ఏంటనే చర్చ ఆ పార్టీ నేతల్లో జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడమా? లేక బీజేపీ అభ్యర్థికి పరోక్షంగా సహకరించడమా? లేదంటే రెండు జాతీయ పార్టీలను ఏకకాలంలో కట్టడి చేయాలని వ్యూహామా? అని గులాబీ నేతల మధ్య డిస్కషన్ జరుగుతున్నది.

Next Story