- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైపోల్ బరిలోకి ఎమ్మెల్యేలు.. ఆ ముగ్గురిపై అనర్హత వేటు!
పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు తప్పదనే ప్రచారం సాగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు తప్పదనే ప్రచారం సాగుతున్నది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు బలమైన ఆధారాలు ఉన్నాయనే టాక్. దీంతో స్పీకర్ తన విచారణ పూర్తి చేసిన తర్వాత వారి సభ్యత్వాలను రద్దు చేసే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉండగా మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, బీఆర్ఎస్ జారీ చేసే విప్‌లను ఫాలో కావాలని సీనియర్లు, శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు.
ఉప ఎన్నికలకు సిద్ధం?
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలకు ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లం సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఇప్పటికే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ‘ఏం జరిగినా ఫేస్ చేయక తప్పదు’ అని తన సన్నిహితుల వద్ద ఆయన కామెంట్ చేసినట్టు తెలిసింది. స్పీకర్ తమపై వేటు వేస్తారని మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం మానసికంగా సిద్ధమవుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో టాక్. ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తరువాత అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దానం ఏకంగా కాంగ్రెస్ బీఫామ్‌పై సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఎంపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్, పేపర్ కటింగ్స్‌ను బీఆర్ఎస్ పార్టీ స్పీకర్‌తో పాటు కోర్టుకు సమర్పించింది. ఆ ఆధారాలే పార్టీ ఫిరాయింపుల కేసుకు బలమైన సాక్ష్యాలుగా మారాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
స్పీకర్ నిర్ణయంపై సస్పెన్స్
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో స్పీకర్ ఏం డెసిషన్ తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. వెంటనే విచారణ చేపడుతారా? లేదంటే మౌనంగా ఉంటారా? అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒక వేళ కోర్టు విధించిన గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే గులాబీ పార్టీ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నదని టాక్. ఒకవేళ విచారణ చేపట్టి.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, మిగతా ఏడుగురు పార్టీ మారినట్టు సరైన ఆధారాలు లేవని స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా? అలా చేస్తే రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఉత్కంఠ రేపుతున్నది.
జర జాగ్రత్త
పార్టీ మారిన వారిలో దానం, కడియం, తెల్లం మినహా మిగతా 7 మంది ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, శ్రేయోభిలాషులు సలహాలు ఇస్తున్నారు. హస్తం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లభించకుండా కేర్‌ఫుల్‌గా ఉండాలని హితబోధ చేస్తున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో జరిగే చర్చలు, ఓటింగ్ సమయంలో గులాబీ పార్టీ విఫ్ జారీ చేస్తే దానిని ఫాలో కావాలని సూచిస్తున్నారు.






