ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు.. నేడు మరోసారి స్పీకర్ విచారణ

by Kema Shiva Kumar |

మరో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్​ నేడు, రేపు విచారణ చేపట్టనున్నారు.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు.. నేడు మరోసారి స్పీకర్ విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మరో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్​ నేడు, రేపు విచారణ చేపట్టనున్నారు. తిరిగి ఈనెల 12,13 తేదీల్లో కూడా విచారణ కొనసాగనున్నది. ఈ విచారణలో ఎమ్మెల్యేల న్యాయవాదులు, పిటిషనర్ల న్యాయవాదులు తమ వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్ లు చేయనున్నారు. ఇటీవలే నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​ఈసారి జరిగే విచారణలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, శేరులింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీలపై దాఖలైన పిటిషన్లను విచారించనున్నారు.

గురువారం ఉదయం 11 గం.లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద వర్సెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఉదయం 12 గం.లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్​రెడ్డి వర్సెస్ సంజయ్, ఈనెల 7న ఉదయం 11గం.లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్​రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, ఉదయం. 12గం.లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్​ వర్సెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ న్యాయవాదుల మద్య వాదనలు, క్రాస్​ఎగ్జామినేషన్ జరుగనున్నది. ఈనెల 12న కేపీ వివేకానంద వర్సెస్ తెల్లం వెంకట్రావు, జగదీష్​రెడ్డి వర్సెస్ సంజయ్, ఈనెల 13న జగదీష్​రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ అరికపూడి గాంధీ న్యాయవాదుల మద్య వాదనలు క్రాస్​ ఎగ్జామినేషన్ జరుగునున్నది. దీనితో ఎనిమిది ఎమ్మెల్యేల విచారణ పూర్తి కానున్నది. స్పీకర్ విచారణ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో పలు ఆంక్షలు విధించారు. మీడియా, సందర్శకులు, రాజకీయ నేతలు, విచారణకు హాజరయ్యే వారిపై కూడా ఆంక్షలు విధించారు. విచారణ సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో పోలీసుల భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Next Story