సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

కాంగ్రెస్‌లో కొత్తవాళ్లదే నడుస్తోంది, సీఎం షో అప్స్ ఎక్కువయ్యాయి.. యాదగిరిగుట్ట బోర్డుపై సమాచారం లేనందుకే నల్లగొండ సభకు వెళ్లలేదు: రాజగోపాల్ రెడ్డి!

సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక టీవీ ఛానల్ లైవ్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు రోజురోజుకూ కనుమరుగవుతున్నారని, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొత్తవాళ్ల హవానే ఇప్పుడు నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో "షో అప్స్" (ఆడంబరాలు) ఎక్కువయ్యాయని, ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలు అస్సలు బాలేవంటూ రాజగోపాల్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.

యాదగిరిగుట్ట బోర్డు వివాదం.. అందుకే సభకు వెళ్లలేదు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) నియామకంపై స్థానిక సీనియర్ నేతగా, ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను సీనియర్ నాయకుడిని, ఇక్కడి ఎమ్మెల్యేని.. నాకే సమాచారం ఇవ్వకపోతే ఎలా?" అని ప్రశ్నించారు. ఈ నియామకాలు, సీఎం వ్యవహారశైలి నచ్చకనే తాను ఇటీవల నిర్వహించిన నల్లగొండ బహిరంగ సభకు హాజరు కాకుండా దూరంగా ఉన్నట్లు ఆయన బహిరంగంగానే స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Next Story